Begin typing your search above and press return to search.

కలకలం..'మహా' సీఎం సెక్యూరిటీ గార్డ్స్ కు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   2 May 2020 5:21 PM GMT
కలకలం..మహా సీఎం సెక్యూరిటీ గార్డ్స్ కు కరోనా పాజిటివ్
X
ఏ వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారో గానీ... శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు గండాల మీద గండాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే సీఎం పదవీ గండాన్ని ఎదుర్కొని ఎలాగోలా దాని నుంచి బయటపడే అవకాశాన్ని దక్కించుకున్న ఠాక్రేను ఇప్పుడు కరోనా వైరస్ గండం పట్టుకుంది. ఠాక్రే నివాసం ‘మాతో శ్రీ’ వద్ద భద్రతా విధుల్లో ఉన్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో మాతో శ్రీతో పాటు యావత్తు మహారాష్ట్రలో పెను కలకలమే రేగింది.

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో దేశంలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో సింహభాగం మహారాష్ట్రలో బయటపడ్డ కేసులే ఉన్నాయి. ఈ క్రమంలో ఎందుకైనా మంచిదన్న భావనతో వీలయినంత ఎక్కువ మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా సీఎం ఠాక్రే అధికారిక నివాసంగా మారిపోయిన మాతో శ్రీ వద్ద భద్రతా విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు పాజిటివ్ అని తేలింది. దీంతో మాతో శ్రీ వద్ద పెను కలకలమే రేగింది.

సీఎం ఇంటి వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తూ కరోనా బారిన పడ్డ ముగ్గురు సెక్యూరిటీ గార్డులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా అధికారులు క్వారంటైన్ కు తరలించారు. సీఎం ఇంటి వద్ద సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్న వారికి కరోనా పాజిటివ్ అని తేలడంతో సీఎం ఇంటిలోని వారంతా కూడా తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. ఇదిలా ఉంటే... దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థగా పేరుగాంచిన ముంబై ఐఐటీలోనూ ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఐఐటీ క్యాంపస్ లో ఉంటున్న ఓ వ్యక్తి భార్యకు కరోనా పాజిటివ్ అని తేలగా... ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐఐటీలో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో క్యాంపస్ లో పెను కలకలమే రేగిందని చెప్పాలి.