Begin typing your search above and press return to search.

అన్నదానం చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్...!

By:  Tupaki Desk   |   18 April 2020 4:40 PM IST
అన్నదానం చేసిన వ్యక్తికి కరోనా పాజిటివ్...!
X
కరోనా మహమ్మారి ఎప్పుడు - ఎవరికీ - ఎలా సోకుతుందో ఎవరికీ తెలియడంలేదు. కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ను అమలు చేస్తున్నప్పటికీ కూడా రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప ..తగ్గడం లేదు. దీనితో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతుంది. తాజాగా సికింద్రాబాద్ లోని నేరేడ్ మెట్ తాలూకా మధురా నగర్ లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది అని , దీంతో అతని కుటుంబంతో పాటు స్థానికులు అందరినీ ఆస్పత్రికి తరలించారు అని , అతనికి కాంటాక్ట్ అయిన సుమారు 40 మందికిపైగా ఇప్పుడు కరోనా నిర్దారణ పరీక్షలు చేస్తున్నారని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

అయితే ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే .. ఆ వ్యక్తి రెండు రోజుల క్రితం అన్నదానం చేయడమే కాకుండా నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. ఈ కార్యక్రమంలో దాదాపుగా 50 మంది పాల్గొన్నట్టు గుర్తించారు. ఇలా జరుగుతుంది అని ముందే ఊహించిన పోలీస్ శాఖ ..ఎవరైనా ఇలా ఫుడ్ పంచడానికి వెళ్ళే వాలంటీర్లు ముందుగా తమ పర్మిషన్ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే , లోకల్ మున్సిపల్ అదికారులకి, కరోనా కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలని, అలా సమాచారం ఇస్తే వారు కూడా వచ్చి భౌతిక దూరం పాటించేలా చూస్తారని తెలిపారు.

ఇదిలావుంటే, తెలంగాణలో ఇప్పటి వరకు 766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 18 మంది కరోనా వ్యాధితో మరణించారు. హైదరాబాదులో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఇదిలావుంటే, భారతదేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 991 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,378కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 43 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మృతుల సంఖ్య 448కి చేరుకుంది.