Begin typing your search above and press return to search.

కరోనాకి బలైన క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్ !

By:  Tupaki Desk   |   7 Aug 2020 5:30 PM GMT
కరోనాకి బలైన క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్ !
X
కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. తాజాగా ఓ వైద్యుడి ప్రాణాలను బలి తీసుకుంది. కరోనా బారిన పడి మణుగూరు కరోనా క్వారంటైన్ సెంటర్ ఇంఛార్జ్ డాక్టర్ జి. నరేశ్ కుమార్ మృతిచెందారు. భద్రాచలం పట్టణానికి చెందిన నరేశ్ కుమార్ గత పదేళ్లుగా వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. పర్ణశాల డీడీవోగా పని చేసిన ఆయన... జిల్లా ఇమ్యూనైజన్ అధికారిగా ఇంఛార్జి బాధ్యతలను పర్యవేక్షించారు. భద్రాచలం ఏరియా హాస్పిటల్ డిప్యూటీ డీఎంహెచ్‌ వో గానూ నరేశ్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. మణుగూరు క్వారంటైన్ సెంటర్ ఇంఛార్జిగా విధులు నిర్వర్తిస్తోన్న సమయంలో డాక్టర్ నరేశ్‌ కు కరోనా సోకింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్లో జాయిన్ చేసారు.

కానీ, పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. డిప్యూటీ డీఎంహెచ్ ‌వో కరోనాతో మరణించడంతో భద్రాద్రి జిల్లాలోని వైద్య వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురైయ్యారు. డాక్టర్ నరేశ్ కుమార్ విధి నిర్వహణలో కచ్చితంగా వ్యవహరించే వారు. భద్రాచలం పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న హాస్పిటళ్లపై డీఎంహెచ్ ‌వో తో కలిసి ఆయన ఉక్కుపాదం మోపారు. భద్రాద్రి జిల్లాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత రెండు వారాల్లోనే జిల్లాలో 500కిపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కరోనా బారిన పడి కోలుకున్నారు. ఎమ్మెల్యేే వనమా సతీమణికి కూడా కరోనా పాజిటివ్ ‌గా నిర్ధారణ అయ్యింది. జిల్లాలోని పోలీసు సిబ్బంది పెద్ద మొత్తంలో కరోనా బారిన పడుతున్నారు.