Begin typing your search above and press return to search.

టీమిండియా లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ ... ఆ ఇద్దరు ఎవరంటే ?

By:  Tupaki Desk   |   30 July 2021 8:30 AM GMT
టీమిండియా లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ ... ఆ ఇద్దరు ఎవరంటే ?
X
ఇండియా ,శ్రీలంక పర్యటనను ముగించుకున్నా కూడా కరోనా మహమ్మారి మాత్రం ఇండియా టీం ను వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే రెండో టీ20 కు ముందు కృనాల్ పాండ్యా కరోనా పాజిటివ్‌ గా తేలిన విషయం తెలిసిందే. తాజగా మరో ఇద్దరికి పాజిటివ్‌ గా తేలడంతో ఆటగాళ్లు ఆందోళనలో ఉన్నారు. జులై 27న క్రునాల్ పాండ్యా కరోనా పాజిటివ్‌ గా తేలిన విషయం తెలిసిందే. టీమిండియా సీనియర్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆల్ రౌండర్ కే గౌతం కరోనా వైరస్ పాజిటివ్‌ గా తేల్చారు. ఇప్పటికే ఐసోలేషన్‌ లో ఉన్న కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా ఉన్న కారణంగా వీరిద్దరికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.

కాగా, కృనాల్ పాండ్యాతో కాంటాక్ట్‌లో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లలో వీరిద్దరు కూడా ఉండడం గమనార్హం. దీనితో కృనాల్ పాండ్యాతోపాటు చాహల్, కే గౌతం సహా మిగిలిన ఆరుగురు క్రికెటర్లు శ్రీలంకలోనే ఉన్నారు. మిగిలిన క్రికెటర్లు ఇండియా బయలుదేరి వస్తున్నట్లు సమాచారం. కృనాల్ పాండ్యాకి గత మంగళవారం కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. అతనితో క్లోజ్‌ కాంటాక్ట్‌లో ఉన్న ఎనిమిది మంది ఆటగాళ్లను బీసీసీఐ ఐసోలేషన్‌ కి తరలించిందిరు. సోమవారం రాత్రి కృనాల్ పాండ్యా తో కలిసి ఈ ఎనిమిది మంది భోజనం చేసినట్లు అక్కడి బీసీసీఐ అధికారులు గుర్తించారు.

దీనితో మంగళవారమే ఆ 8 మందికి ఆర్‌ టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధవారం, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లకీ ఆ 8 మందిని దూరంగా పెట్టారు. ఎనిమిది మందిలో యుజ్వేంద్ర చహల్, కృష్ణప్ప గౌతమ్‌లు కూడా ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఆర్‌ టీపీసీఆర్‌ పరీక్షల్లో చహల్, గౌతమ్‌ లకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా ఇప్పటికే చహల్‌ క్వారంటైన్‌ లో ఉండగా.. తాజాగా గౌతమ్‌ ను కూడా ఐసోలేషన్‌ కు పంపించారు. వీరిద్దరూ కొలంబోలోని మౌంట్ లావినియా హోటల్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరికీ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ వైద్య బృందం వారిని పర్యవేక్షిస్తోంది. ఈ ఇద్దరు కరోనా బారీన పడడంతో మరోసారి ఆటగాళ్లకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

శ్రీలంక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం, ఎవరైనా పాజిటివ్‌గా తేలితే కనీసం పది రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి. అనంతరం మరోరెండు సార్లు వారిని పరీక్షించునున్నారు. ఇందులో నెగిటివ్ వస్తే.. వారిని భారత్‌కు పంపించనున్నారు. శ్రీలంక పర్యటన ముగిసిన వెంటనే ఇంగ్లండ్‌కు వెళ్లాలనుకున్న షా, యాదవ్ జంటకు ఈ పరిణామం మరింత అడ్డంకులను కలిగిస్తుంది.