Begin typing your search above and press return to search.

గాంధీ వైద్యులపై కరోనా రోగుల కుటుంబం దాడి.. మరీ ఇంత ఆరాచకమా?

By:  Tupaki Desk   |   2 April 2020 6:05 AM GMT
గాంధీ వైద్యులపై కరోనా రోగుల కుటుంబం దాడి.. మరీ ఇంత ఆరాచకమా?
X
ఓపక్క ప్రాణాలు పణంగా పెట్టి వైద్యం చేస్తూ.. ప్రాణాలు కాపాడుతున్న వైద్యులపై అమానుషరీతిలో దాడి చేసిన వైనం హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న వైద్యుల్ని ఇవాల్టి రోజున కనిపిస్తున్న దేవుళ్లుగా కొలుస్తున్నారు. అలాంటి వారిపై కరోనా రోగుల కుటుంబ సభ్యులు భౌతిక దాడికి దిగటం.. ఆస్తులకు నష్టం వాటిల్లేలా వ్యవహరించటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు నోట మాట రాకుండా చేస్తోంది. ప్రపంచంలో ఇప్పటివరకూ కరోనా కారణంగా వేలాదిమంది మరణించారు. ఆ దేశం.. ఈ దేశం అన్న తేడా లేకుండా ఎన్నో దేశాల్ని ఆగమాగం చేస్తున్న ఈ పిశాచి వైరస్ వేళ.. రోగులకు అపన్నహస్తం అందించే వారెవరైనా ఉన్నారంటే వైద్యులు ఒక్కరే. మందులేని ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు తమ ప్రాణాల్ని పణంగా పెట్టి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల పట్ల ఉండాల్సిన కనీస మర్యాద.. గౌరవాన్ని వదిలేసి.. నిర్లక్ష్యంగా వ్యవహరించి తమ సోదరుడి మరణానికి కారణమయ్యారంటూ వైద్యులు.. వైద్య సిబ్బందిపై భౌతిక దాడికి పాల్పడిన ఉదంతం గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఉన్న కరోనా రోగుల కుటుంబ సభ్యులు తమపై దాడికి దిగటంతో.. వైద్యులు.. వైద్య సిబ్బంది భయపడిపోయి పరుగులు తీసి.. గదిలో దాక్కున్న దారుణ పరిస్థితి గాంధీలో చోటు చేసుకుంది. విస్తుపోయేలా ఉండే ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని మర్కజ్ నిజాముద్దీన్ లో జరిగిన సభలకు వెళ్లిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ రావటం తెలిసిందే. ఆ కోవలోకే కుత్భుల్లాపూర్ కు చెందిన 49 ఏళ్ల వ్యక్తి అనారోగ్యానికి గురయ్యారు. మార్చి 25న అతన్ని గాంధీకి తరలించారు. అనంతరం.. మిగిలిన కుటుంబ సభ్యులకుపరీక్షలు నిర్వహించగా.. వారిలో మరో ముగ్గురికి పాజిటివ్ అని తేలింది. వెంటనే.. వారిని గాంధీలోని కరోనా వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మొదట ఆసుపత్రిలోకి చేర్చిన 49 ఏళ్ల వ్యక్తి  ఆరోగ్యం ఆందోళకరంగా మారింది. దీంతో.. వైద్యులు వారి కుటుంబ సభ్యులకు పరిస్థితిని వివరించారు.

అదే ఆసుపత్రి లో ఉన్న మిగిలిన ముగ్గురికి ఈ విషయం మీద అవగాహన కలిగించారు. వారి దగ్గర సంతకాలు తీసుకోవటంతో పాటు.. పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్ మీదకు తరలించే ఏర్పాట్లు చేశారు. వెంటిలేటర్ మీదకు మార్చి అరగంటకే సదరు వ్యక్తి మరణించారు. ఈ విసయాన్ని మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులకు వివరించారు. మరణ ధ్రువీకరణ పత్రాల్ని సిద్ధం చేస్తున్న వేళ.. ముగ్గురు రోగుల్లో ఒకరు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. వైద్యులే తన సోదరుడి మరణానికి కారణమంటూ దాడి చేశారు. దీనికి.. మిగిలిన ఇద్దరు సహకరించినట్లుగా చెబుతున్నారు.

వైద్యులు.. వైద్య సిబ్బందిని కాళ్లతో తన్నటమే కాదు.. చేతులతో కొట్టారు. అక్కడే ఉన్న వైద్యుల టీం ఈ పరిణామంతో హడలి పోయారు. ప్రాణాంతకమైన వైరస్ ఉన్న రోగులు ఇలా వ్యవహరించటం.. భౌతిక దాడులకు దిగటంతో వారంతా పరుగులు తీసి గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అయినప్పటికీ తగ్గని వారు.. వారున్న గది తలుపుల్ని పగుల కొట్టాలన్న ఆవేశంతో వ్యవహరించారు.
ఆసుపత్రి సిబ్బంది.. ఇతర ఉద్యోగులు కలుగజేసుకొని వారిని మాటలతో హెచ్చరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

స్థానిక పోలీసులకు దాడి ఉదంతం పై సమాచారం ఇచ్చారు. అయితే.. అక్కడికి వచ్చిన పోలీసులు.. దాడి చేస్తున్న కరోనా రోగుల కుటుంబం వద్దకు వెళ్లి.. వారిని నిలువరించే ప్రయత్నం చేయటంలో వెనుకాడారు. వారి వద్దకు వెళితే.. కరోనా తమకు అంటుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తూ.. వారి వద్దకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. దీంతో.. ఈ సమాచారాన్ని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కు అందజేశారు. దీంతో.. డీసీపీ కల్మెశ్వర్ తో రంగంలోకి దిగారు. దీంతో.. పరిస్థితి ఒక కొలిక్కి వచ్చింది.

భార్యా.. పిల్లల్ని వదిలేసి.. ఒత్తిడితో వైద్య సేవలు అందిస్తున్నతమపై ఈ తీరులో దాడులకు దిగితే తామెలా వైద్యం చేస్తామని గాంధీ వైద్యులు ఆందోళన చేస్తున్నారు. గాంధీనికి అత్యవసర జోన్ గా ప్రకటించి.. ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ వ్యక్తమవుతోంది.ఇదిలా ఉంటే.. వైద్యుల మీద దాడిని తీవ్రంగా ఖండించారు వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్. డాక్టర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఉదంతాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రాణాల్ని పణంగా పెట్టి వైద్యం చేస్తున్న వైద్యులు.. వైద్య సిబ్బందిపై దాడి చేసిన బాధ్యులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. దేవుళ్ల మీద దాడి చేసే కరోనా రోగుల కుటుంబంపై ఇప్పుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.