Begin typing your search above and press return to search.

కరోనా విజృంభణ : ఆఫీస్ వద్దు ..ఆన్లైన్ ముద్దు !

By:  Tupaki Desk   |   24 April 2021 1:30 AM GMT
కరోనా విజృంభణ : ఆఫీస్ వద్దు ..ఆన్లైన్ ముద్దు !
X
దేశంలో మరోసారి కరోనా విజృంభణ మొదలైంది. ఈ సెకండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు ఫస్ట్ వేవ్ లో కంటే ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. అలాగే ప్రతి రోజు కూడా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. గత రెండు రోజులుగా రోజుకి మూడు లక్షల చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. ఇదిలా ఉంటే .. కరోనా మహమ్మారి దెబ్బకి బయటకి రావాలి అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఇల్లు దాటి ఎవరు అడుగేసినా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తోంది.

దీనితో మంత్రులు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా కరోనా ఉధృతి నేపధ్యంలో తమకు తామే స్వీయ నిబంధనలు పెట్టుకుంటున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ ఉంటున్న శ్రీకాకుళం జిల్లాలో కరోనా పంజా విసురుతోంది. దాంతో ఆయన ఏకంగా వారం రోజుల పాటు తన కార్యాలయానికి సెలవు ఇచ్చేశారు. సందర్శకులు అసలు రావద్దు అని వెల్లడించారు. ఇక విశాఖ జిల్లాల్లో కూడా కరోనా తన ప్రతాపం చూపిస్తోంది. దాంతో అనకాపల్లి ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమరనాధ్ కూడా తమ ఆఫీసులకు రావద్దు అని కోరుకుంటున్నారు. బయటకు వచ్చి కరోనా బారిన పడకండి, మీ సమస్యలు ఏమైనా ఉంటే ఫోన్ల ద్వారానే తెలియచేస్తే మేము వాటిని పరిష్కరిస్తామని అన్నారు. ఇక ఇదే తీరున మిగిలిన ప్రజాప్రతినిధులు కూడా ఎవరికైనా అత్యవసరమైన పనులు ఉంటే ఆన్ లైన్ లో కానీ ఫోన్ ద్వారా కానీ సంప్రదించాలని కోరారు. అంతే తప్ప బయటకు వచ్చి మీరు చిక్కుల్లో పడి మమ్మల్ని పెట్టవద్దు అని అంటున్నారు. మొత్తంగా చూస్తే .. సెకండ్ వేవ్ కారణంగా ఆన్లైన్ ముద్దు ఆఫీస్ వద్దు అన్నంతగా మారిపోయింది.