Begin typing your search above and press return to search.

డ్యామేజ్ కవర్ చేసుకోవటానికి దేశం ఇంత భారీ మూల్యం చెల్లించాలా?

By:  Tupaki Desk   |   24 April 2021 5:30 AM GMT
డ్యామేజ్ కవర్ చేసుకోవటానికి దేశం ఇంత భారీ మూల్యం చెల్లించాలా?
X
ఒక దేశానికి ముఖ్యమైనది ఏమిటి? ఈ ప్రశ్నకు చెప్పే సమాధానాల్లో దేశ ప్రజల ఆరోగ్యం అని చెప్పేటోళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నెలకు ఎన్ని కేజీల బియ్యం ఇస్తారు? మరెంత ఉపకారం చేస్తారు? ఇంకేమీ సంక్షేమ పథకాలు అందిస్తారు? లాంటి కోరికలు కోరతారు కానీ.. మీరేం ఇవ్వొద్దు.. స్వచ్ఛమైన మంచినీళ్లు.. ఏదైనా అనారోగ్యం వస్తే ఉచితంగా నాణ్యమైన వైద్యం చేస్తే చాలాయ్యా అని మాత్రం అడిగే నాథుడే కనిపించరు. దశాబ్దాల తరబడి వైద్య ఆరోగ్య వ్యవస్థ విషయంలో పాలకులు ప్రదర్శించిన నిర్లక్ష్యానికి ఈ రోజున దేశ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు.

ఏడాది క్రితం కరోనా దెబ్బకు గజగజలాడిపోయిన నేపథ్యంలో.. రాబోయే ముప్పును అంచనా వేయటం.. అందుకు తగ్గట్లుగా సిద్ధం కావటం అవసరం కదా? అదేమీ ఎందుకు జరగలేదు. దేశం కోసం.. దేశ ప్రజల కోసం అరహరం శ్రమించే మోడీ.. కరోనా 2.0ను ఎందుకు గుర్తించలేకపోయారు? అన్నది ప్రశ్న. మోడీకి బెంగాల్ కావాలి. బీసీసీఐకి ఐపీఎల్ కావాలి. ప్రజలకు వినోదం కావాలి. భక్తి కోసం కుంభమేళ కావాలి. రాష్ట్రాలకు ఆదాయం కావాలి. ఇలా ఎవరి అవసరాలు వారివి. ఎవరి ఆకాంక్షలు వారిమి. అంతేకానీ.. ఎవరికీ దేశం.. అందులోని ప్రజల శ్రేయస్సు అక్కర్లేదు.

మూడు రోజుల క్రితం కూడా కరోనా పట్టని కేంద్రానికి.. పరిస్థితి తీవ్రత అర్థమయ్యాక ‘మేజిక్’ మొదలైంది. తప్పును ఒప్పుకోకున్నా.. సరిదిద్దుకునే పని కన్నా.. ఆగ్రహాన్ని అనుగ్రహం మార్చుకునే ఎత్తులు మొదలయ్యాయి. దేశంలోని 135 కోట్ల జనాభాలో 80 కోట్ల మందికి ఫ్రీగా 5 కేజీల చొప్పున ఆహార ధాన్యాల్ని అందిస్తారట. అది కూడా రెండు నెలల పాటు. అంటే.. పది కేజీలన్న మాట. బహిరంగ మార్కెట్లో ఎంత ఎక్కువ వేసుకున్నా.. కిలో రూ.40చొప్పున అంటే.. పది కేజీలకు రూ.400.

అంటే.. విరుచుకుపడిన మహమ్మారి కారణంగా జరిగిన నష్టానికి.. చోటు చేసుకున్న విధ్వంసాన్ని మర్చిపోయేందుకు ఒక్కో మనిషి మీద కేంద్ర సర్కారు పెడుతున్న పెట్టుబడి అక్షరాల రూ.400. కేంద్రం లెక్కలో చూస్తే.. రూ.26వేల కోట్లు. తిండి గింజలు ముష్టి వేయటానికి బదులుగా.. ఈ భారీ మొత్తాన్ని వైద్యఆరోగ్యాన్ని మరింత మెరుగు పర్చేందుకు.. మౌలిక వసతుల రూపకల్పనకు ఖర్చు పెడితే బాగుంటుంది కదా?

కానీ.. అలా చేయకుండా మనిషికి నెలకు ఐదు కేజీల ఆహార ధాన్యాన్ని ఉచితంగా ఇవ్వటం.. దానికి ‘‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ అనే పథకం పేరుతో అందించే లెక్క చూస్తే.. ఇమేజ్ కోసం పడుతున్న తపన కళ్లకు కట్టినట్లుగా కనిపించక మానదు. తన నిర్లక్ష్యంతో చోటు చేసుకున్న విధ్వంసాన్ని.. జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకునేందుకు ప్రజల సొమ్ముల్నే తెలివిగా ఖర్చు పెట్టటం.. దాంతో ఇమేజ్ ను సంపాదించుకోవటం మోడీ సర్కారుకే చెల్లుతుందేమో? అంతా బాగుంది? కానీ.. పాలకుల నిర్లక్ష్యం కారణంగా కరోనా బారిన పడి ప్రాణం పోగొట్టుకున్న వేలాది కుటుంబాల మాటేంటి?