Begin typing your search above and press return to search.

మ‌న‌కోస‌మే క‌దా.. మిత్ర‌మా? ఆ మాత్రం `ఆపుకోలేమా?`

By:  Tupaki Desk   |   5 May 2021 11:30 PM GMT
మ‌న‌కోస‌మే క‌దా.. మిత్ర‌మా?  ఆ మాత్రం `ఆపుకోలేమా?`
X
ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా చుట్టేసింది. ఎక్క‌డిక‌క్క‌డ కేసులు పెరిగిపోయాయి. రోజుకు వేల సంఖ్య‌లో బాధితులు మృతి చెందుతున్నారు. ఇక‌, ప్ర‌భుత్వ ఆసుప‌త్రులు సైతం నిండిపోతు న్నాయి. వైద్యులు, ఆసుప‌త్రుల సిబ్బంది నిరంత‌రాయంగా శ్ర‌మిస్తూనే ఉన్నారు. అయినా.. రోగులకు స‌రైన వైద్యం అంద‌డం లేద‌ని.. వారు మ‌ర‌ణిస్తున్నార‌ని.. విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఇక‌, ఆసుప‌త్రుల్లో బెడ్‌లు నిండిపోయి.. రోడ్ల‌పైనే టెంట్‌లు వేసి.. అక్క‌డే వైద్యం అందిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అంటే.. మొత్తంగా కూడా ఏపీ.. క‌రోనా కోర‌ల్లో చిక్కుకుపోయింది.

ప్ర‌భుత్వం కూడా ఒక‌ర‌కంగా చేతులు ఎత్తేసింది. ఈ నేప‌థ్యంలోనే అస‌లు ఇష్ట‌మే లేకున్నా.. సీఎం జ‌గ‌న్ పాక్షిక క‌ర్ఫ్యూను అమ‌లు చేయ‌డం ప్రారంభించారు. స‌రే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున తీసుకునే చ‌ర్య‌ల‌పై విమ‌ర్శ‌లు.. ప్ర‌తివిమ‌ర్శ‌లు ప‌క్క‌న పెడితే.. బాధ్య‌త ఉన్న పౌరులుగా మ‌నం చేయాల్సిన ప‌నేంటి? క‌రోనా అత్యంత తీవ్ర‌మైన అంటువ్యాధి అని.. గ‌త ఏడాది ఉన్న క‌రోనాకు, ఇప్పుడున్న క‌రోనాకు మ‌ద్య చాలా వ్య‌త్యాసం ఉంద‌ని.. ఇప్పుడు రోజుల వ్య‌వ‌ధిలోనే క‌రోనా బారిన ప‌డిన‌వారు మృతి చెందుతున్నారు.

ఏపీలోనూ సామూహిక అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్న శ్మ‌శానాలు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఇంత జ‌రుగుతున్నా.. మ‌న‌లో క‌నీసం అవ‌గాహ‌న ఉందా? ఏపీ ప్ర‌భుత్వం కానీ, తెలంగాణ స‌ర్కారు కానీ, ఏమీ చేయ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్న వారు.. వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. ఏమేర‌కు తీసుకుంటున్నారు? ఇంట్లో నుంచి అవ‌స‌రం ఉంటేనే బ‌య‌ట‌కు రావాల‌ని చెబుతున్నా.. పొలో మ‌ని బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం లేదా? ఒక్క రెండు వారాలు ఇంట్లో ఉండే ప‌రిస్థితి లేదా? ఆమాత్రం మ‌న‌ల్ని మ‌నం నియంత్రించుకోలేమా?

మ‌న‌కు ఉన్న టెన్ష‌న్‌.. బ‌య‌ట ఏం జరుగుతోందో తెలుసుకోవాల‌నే ఆదుర్దాను క‌ట్టడి చేసుకుంటే.. క‌రోనా సోకే అవ‌కాశం కూడా త‌గ్గుతుంద‌ని చెబుతున్నా.. మ‌నం వినిపించుకుంటున్నామా? నిపుణులు చెబుతున్నా.. మ‌నం పెడ‌చెవిన పెట్ట‌డం లేదా? ఈ విష‌యాల‌ను ప్ర‌తి ఒక్క‌రూ వ్య‌క్తిగ‌తంగా ఆలోచించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అప్పుడే.. క‌రోనా.. దూర‌మ‌య్యే ప‌రిస్థితి ఉంటుంది త‌ప్ప‌.. మ‌న మానాన మ‌నం రోడ్ల మీద తిరిగేస్తాం.. క‌రోనా మాత్రం రాకూడ‌దు.. వ‌చ్చినా.. ప్ర‌భుత్వాలే న‌యం చేయాలి! అనే ధోర‌ణిని ఇప్ప‌టికైనా విడ‌నాడితేనే శ్మ‌శానాలు ఊపిరి పీల్చి కుంటాయి!!