Begin typing your search above and press return to search.

క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సం.. కార‌ణాలివే!

By:  Tupaki Desk   |   1 April 2021 1:30 PM GMT
క‌రోనా సెకండ్ వేవ్ బీభ‌త్సం.. కార‌ణాలివే!
X
మార్చి 29న దేశంలో న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 68 వేల 20. ఈ గ‌ణాంకాలు చాలు.. క‌రోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అర్థం చేసుకోవ‌డానికి! ఈ స్థాయిలో కేసులు న‌మోద‌వ‌డానికి మొద‌టి ద‌శ‌లో చాలా కాలం ప‌ట్టింది. కానీ.. రెండో ద‌శ‌లో కేవ‌లం రెండు నెల‌ల్లోనే ఈ స్థాయిలో కేసులు న‌మోదవుతుండ‌డంతో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ప్ర‌భుత్వం త‌గిన విధంగా ఆదేశాలు జారీచేస్తోంది. మ‌రోసారి నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేస్తూ వ‌స్తోంది. అయిన‌ప్ప‌టికీ.. కేసుల పెరుగుద‌ల మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌ట్లేదు. దీనికి వైర‌స్ ప‌రంగా కొన్ని కార‌ణాలుండ‌గా.. జ‌నాల స్వ‌యంకృతాప‌రాధం కూడా ఉంటోంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు కార‌ణాల వ‌ల్లే కేసులు వేగంగా పెరుగుతున్నాయ‌ని చెబుతున్నారు.

క‌రోనా మొద‌టి ద‌శ నెమ్మ‌దించ‌డంతో జ‌నాల్లో ఒక భావ‌న ఏర్ప‌డింది. ఇక కొవిడ్ త‌గ్గిపోయిన‌ట్టే అనే భావ‌నలోకి వ‌చ్చేశారు. అంతేకాకుండా.. వ్యాక్సిన్ కూడా వ‌చ్చేసింద‌నే ధైర్యం పెరిగింది. ఈ రెండు కార‌ణాల‌తో చాలా మంది మాస్కులు లేకుండా తిరిగేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది చేతులు కూడా క‌డుక్కోవ‌డం మానేశార‌ని అంటున్నారు. ఇక‌, మొద‌టి సారి వ్యాక్సిన్ వేయించుకున్న‌‌వారు.. రెండోసారి వేయించుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇలాంటి కార‌ణాల‌తో కేసులు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా పెరుగుతున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వోతంది.

ఇంతేకాకుండా.. క‌రోనా ఎన్ని విధాలుగా రూపాంత‌రం చెందిందో ఎవ్వ‌రూ చెప్ప‌లేకున్నారు. ఇందులో ప్ర‌ధానంగా బ్రిట‌న్ వేరియంట్ ప్ర‌బ‌ల శ‌క్తిగా త‌యారైంది. దీంతోపాటు బ్రెజిల్ వేరియంట్ కూడా ప్ర‌మాద‌క‌రంగానే ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇవి రెండూ భార‌త్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయ‌ని స‌మాచారం. పైన చెప్పిన జ‌నాల నిర్ల‌క్ష్యానికి.. ఇవి రెండు వేరియంట్లు తోడ‌వ‌డంతో కేసులు బాగా పెరుగుతున్నాయ‌ని అంటున్నారు.

ఇక‌, వ్యాక్సిన్ల ప్ర‌భావం ఎంత అనేది చెప్ప‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టి వ‌ర‌కూ పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ప్ర‌భావ శీల‌త క‌నిపించ‌లేదు. దీనికి కార‌ణం.. వంద‌శాతం ఖ‌చ్చిత ప్ర‌భావం చూపిస్తాయ‌ని తేల‌క‌పోవ‌డం ఒ‌క‌టైతే.. ఇప్ప‌టి వ‌ర‌కూ పూర్తిస్థాయిలో అంద‌రికీ వ్యాక్సిన్ అంద‌క‌పోవ‌డం మ‌రో కార‌ణం. మ‌న దేశంలో ద‌దాపు 130 కోట్ల పై చిలుకు జ‌నాభా ఉంటే.. ఇప్ప‌టి వ‌ర‌కూ వ్యాక్సిన్ అందింది కేవ‌లం ఆరు కోట్ల పైచిలుకు మందికి మాత్ర‌మే! జ‌న‌వ‌రి 16 నుంచి మొద‌లైన వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. దేశం మొత్తానికి వ్యాక్సిన్ అందేనాటికి ఎంత కాలం ప‌డుతుందో ఎవ్వ‌రూ చెప్ప‌లేని ప‌రిస్థితి.

అయి‌తే.. కొంత‌లో కొంత ఊర‌ట ఏమంటే.. సెకండ్ వేవ్ లో కేసులు పెరుగుతున్న‌ప్ప‌టికీ.. మ‌ర‌ణాల సంఖ్య మాత్రం త‌క్కువ‌గా ఉంది. రోజుకు స‌గ‌టున‌ 260కి కాస్త అటూ ఇటూగా న‌మోద‌వుతున్నాయి. మొద‌టి ద‌శ‌లో ఈ ప‌రిస్థితి క‌న్నా ఎంతో ముందుగానే లాక్ డౌన్ విధించింది ప్ర‌భుత్వం. కానీ.. దానివ‌ల్ల ఎదురైన ఆర్థిక న‌ష్టాల‌ను ఇప్ప‌టికీ పూడ్చుకోలేక‌పోతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. మ‌రోసారి లాక్ డౌన్ అంటే.. ఊహించ‌లేని ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. అందుకే.. దేశం, రాష్ట్రాలు లాక్ డౌన్ కు ముందుకు రావ‌ట్లేదు.

కాబ‌ట్టి.. ఇప్పుడు ప్ర‌భుత్వాలు చేయ‌డానికి ఏమీ లేదు. అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సింది ప్ర‌జ‌లే. ఏ మాత్రం నిర్ల‌క్ష్యం వ‌హించ‌కుండా.. క‌రోనా నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా పాటించాలి. బ‌య‌ట‌కు వెళ్తే త‌ప్ప‌క మాస్కు ధ‌రించాలి. వెళ్లే ముందు, వ‌చ్చిన త‌ర్వాత చేతులు శానిటైజ్ చేసుకోవాలి. భౌతిక దూరం పాటించాలి. ఇవ‌న్నీ.. స‌క్ర‌మంగా పాటిస్తేనే.. కేసుల పెరుగుద‌ల నిరోధించ‌డం సాధ్య‌మ‌వుతుంది. లేదంటే.. జ‌ర‌గ‌బోయే ఘోరాల‌ను క‌ళ్లారా చూడాల్సి ఉంటుంది. అందులో స‌మిధ‌లుగా మారే అవ‌కాశం కూడా ఉంటుంది. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.