Begin typing your search above and press return to search.

గాంధీ ఆస్పత్రి లో కరోనా కలకలం..8 మంది అనుమానితులు!

By:  Tupaki Desk   |   3 March 2020 5:30 PM GMT
గాంధీ ఆస్పత్రి లో కరోనా కలకలం..8 మంది అనుమానితులు!
X
చైనాలోని వుహాన్‌ లో ఉద్భవించిన కరోనా మహమ్మారి.. ప్రపంచాన్నేవణికిస్తోంది. చైనా వ్యాప్తంగా విస్తారించి వేల సంఖ్యలో ప్రజల ప్రాణాల్ని హరించివేసింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 64దేశాలకు పాకింది. ప్రపంచ వ్యాప్తంగా 90వేల931 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3వేల125మంది చనిపోయారు. తాజాగా ఈ వైరస్ తెలంగాణ కి పాకిన విషయం తెలిసిందే. బెంగళూరు నుంచి బస్సులో వచ్చిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుకు వైరస్ సోకినట్లు నిర్ధారించారు. బస్సులో వచ్చిన ఇతర ప్రయాణికులకు పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ సోకిన బాధితుడికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగా ణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇదిలాఉండగా.. వైరస్‌ బారినపడ్డ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి తొలుత చికిత్స అందించిన సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రి సిబ్బంది కూడా గాంధీకి క్యూ కట్టారు. వారికి కరోనా నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి. మరోవైపు తాజాగా ఎనిమిది మంది కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల వారంతా ఇటలీ, ఇండొనేషియా, ఇజ్రాయెల్, జపాన్‌ నుంచి వచ్చారు. కరోనా లక్షణాలు కనపడడంతో ఆసుపత్రిలో చేరారు. దీనితో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా పై హై అలర్ట్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే ఎవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం వచ్చినా కూడా వెంటనే గాంధీకి వచ్చి పరీక్షలు చేపించుకోవాలని ప్రభుత్వం చెప్తుంది.