Begin typing your search above and press return to search.

కరోనా: నిజామాబాద్ లో వైద్య సిబ్బందిని తరిమేశారు

By:  Tupaki Desk   |   2 April 2020 4:30 PM GMT
కరోనా: నిజామాబాద్ లో వైద్య సిబ్బందిని తరిమేశారు
X
ఢిల్లీలోని మర్కాజ్ లో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లిన వారికి కరోనా సోకుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి వందలాది మంది వెళ్లడం తో వారికి పరీక్షలు చేయగా..రోగుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి 1085, తెలంగాణ నుంచి 1030మంది ఢిల్లీ వెళ్లారని గుర్తించిన అధికారులు ఇప్పుడు వారిని వెతికే పనిలో పడ్డారు. దీంతో రెండు రోజుల్లోనే తెలంగాణ, ఏపీల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగాయి.

కాగా తాజాగా మర్కజ్ యాత్రికులను గుర్తించి వారికి పరీక్షలు చేయడానికి వెళుతున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి.. తాజాగా నిజామాబాద్ నగరం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు 50 మంది వెళ్లొచ్చినట్టు అధికారులు గుర్తించారు. పోలీసుల సాయంతో వాళ్లందరి నీ అదుపులోకి తీసుకొని క్వారంటైన్ కు తరలించారు. ఇందులో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా.. మరికొందరి టెస్టుల ఫలితాలు రావాల్సి ఉంది. వాళ్ల కుటుంబీకులకు వైరస్ పరీక్షలు చేస్తున్నారు. కానీ జనం వైద్య సిబ్బందిని అడ్డుకొని నానా మాటలు అనడం తో తాజాగా నిజామాబాద్ లో నర్సులు, వైద్య సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.

తాజాగా నిజామాబాద్ లో ఢిల్లీ ప్రార్థనలు చేసిన వారింటికి ప్రభుత్వ ఆరోగ్య సిబ్బంది పరీక్షలు చేయడానికి వెళ్లారు. వీరిని చూసిన కరోనా అనుమానితులు బండ బూతులు తిట్టారు. వీధిలో నుంచి కుక్కల్ని తరిమినట్టు తరిమేశారు. వైరస్ టెస్టులు చేయించుకోకపోతే కలిగే ప్రమాదంపై వివరించినా వాళ్లు వినిపించుకోలేదని ఆరోగ్య సిబ్బంది కన్నీటిపర్యంతమయ్యారు. కొట్టడానికి మీదమీదకొచ్చాని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజామాబాద్ లో ఆరోగ్య సిబ్బందిపై దాడి విషయంలో స్థానిక ఎంపీ అరవింద్ స్పందించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా కరోనా టెస్టులకు నిరాకరించేవారు.. వైద్యులపై దాడులు చేసేవారు అజ్ఞానులని.. సమాజానికే ప్రమాదకారులు అంటూ కేటీఆర్ ట్వీట్ లో మండిపడ్డారు.