Begin typing your search above and press return to search.

‘క‌రోనా మాత’ ఆల‌యం నిర్మించారు.. తర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Jun 2021 12:30 PM GMT
‘క‌రోనా మాత’ ఆల‌యం నిర్మించారు.. తర్వాత ఏం జ‌రిగిందో తెలుసా?
X
మ‌నదేశంలో మూఢ విశ్వాసాలు ప్రజల మూలాల్లో ఎంత‌లా పాతుకుపోయాయో చెప్ప‌డానికి స‌జీవ సాక్ష్య‌మిది. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు తీసిన‌ క‌రోనా వైర‌స్ కు గుడి క‌ట్టి ‘క‌రోనా మాత’ అంటూ పూజిస్తున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని జ‌నం. ఆ రాష్ట్రంలోని జుమి శుక్లాపూర్ లో ఈ గుడిని నిర్మించారు.

లోకేష్ శ్రీవాస్త‌వ అనే ఓ వ్య‌క్తి స్థానికుల నుంచి చందాలు వ‌సూలు చేసి ఐదు రోజుల క్రితం క‌రోనా మాత ఆల‌యాన్ని నిర్మించాడు. ఓ విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేసి, అందులో ఉంచారు. అంతేకాదు.. ఈ గుడికి ఓ పూజారిని కూడా నియ‌మించారు. ఆయ‌న పేరు రాధేశ్యామ్ వ‌ర్మ‌. ఈయ‌న నిత్యం అక్క‌డ పూజ‌లు చేస్తూ.. క‌రోనా నిర్మూల‌న కావాల‌ని దండాలు పెడుతున్నాడు.

అయితే.. ఈ ఆల‌యాన్ని నిర్మించిన లోకేష్ నోయిడాలో ఉంటున్నాడు. ఈ గుడి నిర్మించిన ప్రాంతం అత‌ని సొంతం కాద‌ట‌. ఇత‌నితోపాటు మ‌రో ముగ్గురికి చెందిన ఉమ్మ‌డి ఆస్తిగా చెబుతున్నారు. దీంతో.. మిగిలిన ముగ్గురు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌మ స్థ‌లాన్ని క‌బ్జా చేసేందుకే అక్క‌డ ఆల‌యం నిర్మించార‌ని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో.. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఈ క్ర‌మంలోనే రెండు రోజుల క్రితం ఆ గుడి ధ్వంస‌మైంది. రాత్రివేళ గుర్తు తెలియ‌ని వ్యక్తులు క‌రోనా మాత గుడిని కూల‌గొట్టారు. దీంతో.. ఈ గుడిని పోలీసులే కూల‌దోశార‌ని స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోప‌ణ‌ల‌ను పోలీసులు తోసిపుచ్చారు. వివాదాస్ప‌ద భూమిలో నిర్మించిన‌ది కావ‌డంతో.. ఆ వివాదంతో సంబంధం ఉన్న‌వారే కూల్చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.