Begin typing your search above and press return to search.

బ్రీత్ ఎనలైజర్ సాయంతో కరోనా టెస్ట్.. నిమిషంలో రిజల్ట్!

By:  Tupaki Desk   |   26 May 2021 2:30 AM GMT
బ్రీత్ ఎనలైజర్ సాయంతో కరోనా టెస్ట్.. నిమిషంలో రిజల్ట్!
X
కరోనా మహమ్మారిని నిర్ధారించడానికి ఇప్పటికే పలు పరీక్షా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్, సీటీ స్కానింగ్, చెస్ట్ ఎక్స్ రే పద్ధతులతో వైరస్ ను గుర్తిస్తున్నారు. అయితే ఈ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. దీనిని నివారించడానికే సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ అద్భుత పరికరాన్ని ఆవిష్కరించారు. నిమిషాల్లోనే కరోనాను గుర్తించవచ్చని అంటున్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆల్కహాల్ శాతాన్ని పరీక్షించే బ్రీత్ ఎనలైజర్ సాయంతో కరోనాను గుర్తించవచ్చునని సింగపూర్ పరిశోధకులు తెలిపారు. శ్వాస వేగాన్ని బట్టి కరోనా ఆనవాళ్లను పసిగడుతుందని వెల్లడించారు. శ్వాసను విశ్లేషించి నిమిషంలో రిజల్ట్ ను అందిస్తుందని వివరించారు. ఈ పరీక్షను ఎలాంటి రిస్క్, దుష్ర్పభావాలు లేకుండా చాలా సులభంగా నిర్వహించవచ్చునని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ పరీక్షలను సింగపూర్ ప్రభుత్వం తాత్కాలిక అనుమతులను మంజూరు చేసింది. దీనిపై మరిన్ని ప్రయోగాలు చేయడానికి పరిశోధకులు సిద్ధమవుతున్నారు. అత్యవసర అనుమతులు లభించిన ఈ పరికరం ఫలితాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని పరిశోధకులు తెలిపారు.

ఈ పరికరం అందుబాటులోకి వస్తే పరీక్షా చేయడం చాలా సులభం అవుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో వైరస్ ను అతి త్వరగా గుర్తించవచ్చునని పేర్కొన్నారు. మహమ్మారి వ్యాపించకుండా చర్యలు చేపట్టవచ్చునని అభిప్రాయపడుతున్నారు. మరణాల రేటును నియంత్రించవచ్చునని చెప్పారు. కాగా కొవిడ్ కట్టడిలో వైరస్ నిర్ధారణ కీలక పాత్ర పోషిస్తుందని వారు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న పరీక్షా పద్ధతుల్లో ఫలితాలు రావడానికి చాలా సమయం పడుతుందని అన్నారు. ఆలోపే కొందరి పరిస్థితి తీవ్రతరం అవుతుందని అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించే పరికరాన్ని అభివృద్ధి చేయడం అవశ్యమని కొనియాడారు.