Begin typing your search above and press return to search.

కరోనా పరీక్షలు దేశ వ్యాప్తంగా అలా.. ఏపీలో మాత్రం ఇలా

By:  Tupaki Desk   |   8 April 2020 3:45 AM GMT
కరోనా పరీక్షలు దేశ వ్యాప్తంగా అలా.. ఏపీలో మాత్రం ఇలా
X
సాంకేతికంగా తోపు.. మౌలిక సదుపాయాల విషయంలో తిరుగులేని అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు కుప్పలు.. తెప్పలుగా నమోదవుతున్న వేళ.. భారత్ లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఎందుకుందన్న మాట తరచూ వినిపిస్తోంది. ఈ విషయాన్ని పలువురు కొత్త కోణంలో చూస్తున్నారు. అమెరికాతో పోలిస్తే.. భారత్ లో కరోనా పరీక్షలు చేస్తున్న సంఖ్య తక్కువగా ఉండటంతో.. పాజిటివ్ సంఖ్య పెరగటం లేదన్న వాదనను వినిపిస్తున్నారు. గతానికి భిన్నంగా ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా పరీక్షల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పలు రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా సాగుతుండటం విశేషం. కొన్ని రాష్ట్రాల్ని మినహాయిస్తే.. మిగిలిన రాష్ట్రాల కంటే మిన్నగా ఏపీ ఉండటం గమనార్హం. ఎక్కడిదాకానో ఎందుకు.. ముందుచూపు కేసీఆర్ తర్వాతే పుట్టినట్లుగా వ్యవహరించే తెలంగాణ కంటే ఏపీలోనే కరోనా పరీక్షలు ఎక్కువగా జరుగుతుండటాన్ని మర్చిపోకూడదు. గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో ప్రతి పదిలక్షల మందిలో కేవలం 47 మాత్రమే కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. అందుకు భిన్నంగా ఏపీలో మాత్రం ఇది 78.6గా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ప్రతి పదిలక్షల మందికి 52.4 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. రానున్న కొద్ది రోజుల్లో ఈ సంఖ్య మరింత మెరుగు కానుంది. పొరుగున ఉన్న తెలంగాణ లో ప్రతి పది లక్షల మందిలో కేవలం 35.79 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ లో మరణాల రేటు 2.60 శాతం ఉంటే.. ఏపీలో మాత్రం 0.53కే పరిమితైంది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా పరీక్షల విషయంలో ఏపీ ముందుంది. మధ్యప్రదేశ్.. పశ్చిమబెంగాల్.. ఉత్తరప్రదేశ్ లలో చూస్తే వరుసగా 7.24, 10.69, 10.66 మందికి మాత్రమే పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఇలా చాలా రాష్ట్రాల్లో తక్కువగానే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో కరోనా పరీక్షల విషయంలో కేరళ రాష్ట్రం చాలా ముందుంది. సమీప భవిష్యత్తు లో ఎవరూ టచ్ చేయని రీతిలో పెద్ద ఎత్తున పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్రం లో ప్రతి పది లక్షల మందిలో 275.98 మందికి పరీక్షలు చేస్తున్నారు. తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఆ రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో 60.65 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.