Begin typing your search above and press return to search.

థ‌ర్డ్ వేవ్ వస్తున్నట్టేనా..? ఆ జిల్లాల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌!

By:  Tupaki Desk   |   31 July 2021 4:30 PM GMT
థ‌ర్డ్ వేవ్ వస్తున్నట్టేనా..? ఆ జిల్లాల‌కు కేంద్రం హెచ్చ‌రిక‌!
X
భ‌య‌ప‌డిన‌ట్టే జ‌రుగుతోందా? కరోనా థర్డ్ వేవ్ మొద‌లైందా? అంటే.. సంకేతాలు మాత్రం అదేవిధంగా క‌నిపిస్తున్నాయి. దేశంలోని ప‌లు జిల్లాలో పాజిటివిటీరేటు పెరుగుతుండ‌డంతో.. కేంద్రం అల‌ర్ట్ అయ్యింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న జిల్లాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. ఈ జిల్లాల్లో కేసుల వేగం చూస్తే.. థ‌ర్డ్ ఆరంభానికి సూచిక‌లుగానే క‌నిపిస్తున్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ రావ‌డం అనేది క‌న్ఫామ్ అని ముందు నుంచీ ప‌లువురు నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఒక్కొక్క‌రు ఒక్కో విధ‌మైన వ్యాఖ్యానాలు చేస్తూ వ‌చ్చారు. కొంద‌రు పెద్ద‌గా ప్ర‌భావం ఉండ‌ద‌ని చెప్ప‌గా.. మ‌రికొంద‌రు గ‌ట్టి ఎఫెక్టే ఉంటుంద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు థ‌ర్డ్ వేవ్ రానేరాదు అని కూడా అన్నారు. ఆగ‌స్టు నాటికి వేగం పుంజుకుంటుంద‌ని, ఆగ‌స్టు అర్ధ‌భాగం త‌రువాత కేసుల సంఖ్య‌లో మ‌రింత వేగం పెరుగుతుంద‌ని అంచ‌నా వేశారు. సెప్టెంబ‌ర్ నాటికి గ‌రిష్ఠ స్థితికి చేరుకుంటుందని ఎస్బీఐ రిపోర్టు కూడా వెల్ల‌డించింది.

ప్ర‌పంచ వ్యాప్తంగా చూసుకున్న‌ప్పుడు థ‌ర్డ్ వేవ్ స‌గ‌టు ఉధృతి రేటు 1.7 రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని ప‌లు నివేదిక‌లు వెల్ల‌డించాయి. భార‌త దేశానికి వ‌చ్చే స‌రికి ఇది మ‌రింత పెరుగుతుంద‌ని, అక్టోబ‌ర్ - న‌వంబ‌ర్ నెల‌ల్లో పీక్ స్టేజ్ కు చేరుకుంటుంద‌ని ప్ర‌భుత్వ ప్యానెల్ శాస్త్ర‌వేత్త‌లు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే.. సెకండ్ వేవ్ తో పోలిస్తే రోజూవారి గ‌రిష్ట కేసులు స‌గం త‌గ్గుతాయ‌ని అంచ‌నా వేశారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌కుంటే మాత్రం.. ప‌రిస్థితి మ‌రింత ఉధృతం కావొచ్చ‌ని చెప్పారు.

తాజాగా ప‌రిస్థితి చూస్తుంటే.. వీళ్లు చెప్పిన‌ట్టుగానే జ‌రుగుతోందనే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది. మొత్తం ప‌ది రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్న‌ట్టు కేంద్రం గుర్తించింది. అందులో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క‌, ఒడిషా, మేఘాల‌య‌, మిజోరాం, అసోం, మ‌ణిపూర్‌, ఏపీ రాష్ట్రాలు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ రాష్ట్రాల్లో లాక్ డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఆదేశాలు జారీచేసింది. దాంతోపాటు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కూడా వేగ‌వంతం చేయాల‌ని సూచించింది.

ఈ రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల మ‌రింత ఎక్కువ‌గా.. మ‌రికొన్ని జిల్లాల్లో కొంత త‌క్కువ‌గా కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో.. హై రిస్క్ ఉన్న ప్రాంతాలుగా మొత్తం దేశంలోని 46 జిల్లాల‌ను గుర్తించింది. ఈ జిల్లాల్లో పాజిటివిటీ రేటు ప‌ది శాతానికి పైగా ఉంద‌ని వెల్ల‌డించింది. మ‌రో 53 జిల్లాల‌ను కూడా గుర్తించి, ఇక్క‌డ ఐదు నుంచి 10 శాతానికి మ‌ధ్య‌లో పాజిటివిటీ రేటు ఉంద‌ని ప్ర‌క‌టించింది. కేంద్ర ప్ర‌భుత్వం గుర్తించిన ఈ 46 జిల్లాల్లో దాదాపు 80 శాతం రోగులు హోం ఐసోలేష‌న్లోనే ఉన్నార‌ని, వీరంతా బ‌య‌ట‌కు రాకుండా చూడాల‌ని, త‌ద్వారా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకోవాల‌ని సూచించింది.

దీంతో.. జ‌నాల్లో మ‌ళ్లీ క‌రోనా భ‌యం మొద‌లైంది. సెకండ్ వేవ్ మిగిల్చిన చేదు జ్ఞాప‌కాల‌ను త‌లుచుకొని బెంబేలెత్తిపోతున్నారు. ప్ర‌పంచంలో మ‌రే దేశంపైనా వైర‌స్‌ ఈ స్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేదు. అయితే.. క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన‌వారితోపాటు ప‌డ‌నివారు కూడా తీవ్రంగా ప్ర‌భావిత‌మ‌య్యారు. ఎన్నో క‌ష్టాలు.. మ‌రెన్నో న‌ష్టాలు అనుభ‌వించారు. ఆసుప‌త్రిలో ట్రీట్మెంట్ పేరుతో ఆస్తులు పోగొట్టుకున్నారు. ఉన్న‌దంతా ఊడ్చి పెట్టారు. అప్పుల‌పాల‌య్యారు. అయితే.. అది ఎంత అన్న‌ది స్ప‌ష్టంగా ఎవ్వ‌రికీ తెలియ‌దు. ఎవ‌రు ఎంత న‌ష్ట‌పోయారు.. అన్న‌ది వారికి మాత్ర‌మే తెలుసు. అయితే.. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఒక స‌ర్వేలో కొవిడ్ కార‌ణంగా దేశ ప్ర‌జ‌లు ఖ‌ర్చుపెట్టిన వివ‌రాలు తెలిస్తే షాక‌వ్వాల్సిందే. దేశంలోని క‌రోనా బాధితులు ఏకంగా 64,000 కోట్ల రూపాయ‌ల‌ను క‌రోనా ట్రీట్మెంట్ కోసం ఖ‌ర్చు చేశార‌ని ఆ నివేదిక వెల్ల‌డించింది. మ‌రి, ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ వ‌స్తే.. ప‌రిస్థితులు ఇంకా ఎలా ఉంటాయోన‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.