Begin typing your search above and press return to search.

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఆ నెల‌లోనేః నీతిఅయోగ్

By:  Tupaki Desk   |   5 Jun 2021 8:30 AM GMT
క‌రోనా థ‌ర్డ్ వేవ్ ఆ నెల‌లోనేః నీతిఅయోగ్
X
మ‌న దేశంపై క‌రోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో దాడిచేసిందో తెలిసిందే. నిత్యం 4 ల‌క్ష‌ల కేసుల‌తో జ‌నాన్ని తీవ్రంగా వ‌ణికించింది. అయితే.. కొవిడ్ ప్ర‌భావం ఇప్పుడు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. తాజాగా దేశంలో న‌మోదైన ఒక‌రోజు క‌రోనా కేసుల సంఖ్య 1.3 ల‌క్ష‌లు. త‌ద్వారా.. కొవిడ్ తీవ్ర‌త చాలా వ‌ర‌కు త‌గ్గింద‌ని చెప్పొచ్చు. అయితే.. కేసులు త‌గ్గుతున్నా జ‌నాల్లో భ‌యం మాత్రం అలాగే ఉంది. థ‌ర్డ్ వేవ్ హెచ్చ‌రిక‌లు వినిపిస్తుండ‌డమే ఇందుకు కార‌ణం.

ప‌లువురు వైద్య నిపుణులు థ‌ర్డ్ వేవ్ గురించి చాలా రోజులుగా హెచ్చ‌రిక‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రం కూడా రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తోంది. దీంతో.. ప్ర‌జ‌లు అల‌స‌త్వం వ‌హించొద్ద‌ని, కొవిడ్ నిబంధ‌న‌లు ఖ‌చ్చితంగా అంద‌రూ పాటించాల‌నే సూచ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.

అయితే.. తాజాగా నీతి అయోగ్ స‌భ్యుడు వీకే సార‌స్వ‌త్ థ‌ర్డ్ వేవ్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న‌.. కొవిడ్ సెకండ్ వేవ్ ను నిరోధించేందుకు చాలా కృషి చేసిన‌ట్టు చెప్పారు. క‌రోనా కేసుల సంఖ్య‌ను ల‌క్ష వ‌ద్ద‌కు తీసురావ‌డం ఒక విధంగా సంతోషించాల్సిన అంశం అన్న ఆయ‌న‌.. థ‌ర్డ్ వేవ్ కు దేశం సిద్ధం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

క‌రోనా మూడో ద‌శ ఎప్పుడు రావొచ్చ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ.. సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ నెల‌ల్లో మొద‌లు కావొచ్చ‌ని వైద్య నిపుణులు అంచ‌నా వేస్తున్నార‌ని తెలిపారు. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధంగా ఉండాల‌ని అన్నారు. అప్ప‌టి వ‌ర‌కు వీలైనంత ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు. అయితే.. థ‌ర్డ్ వేవ్ ప్ర‌భావం పిల్ల‌లు, యువ‌కుల‌పై ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు చెబుతున్నార‌ని, వ్యాక్సినేష‌న్ ద్వారా మాత్ర‌మే ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునే అవ‌కాశం ఉంద‌ని చెప్పారు.

కానీ.. దేశంలో ప‌రిస్థితి చూస్తే న‌త్త‌క‌న్నా నెమ్మ‌దిగా సాగుతోంది వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న‌ వారు 20 కోట్ల మంది కూడా లేర‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ లెక్క‌న్న రెండో డోస్ తీసుకున్న వారు ఇంకా చాలా త‌క్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. అలాంటిది థ‌ర్డ్ వేవ్ కు మ‌రో మూడు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌ని చెబుతున్న నేప‌థ్యంలో.. ఎంత మందికి వ్యాక్సిన్ అందుతుంద‌నే ఆందోళ‌న నెల‌కొంది.