Begin typing your search above and press return to search.

‘డెల్టా ప్లస్’ తోనే థర్డ్ వేవ్..?

By:  Tupaki Desk   |   24 Jun 2021 1:30 PM GMT
‘డెల్టా ప్లస్’ తోనే థర్డ్ వేవ్..?
X
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన బీభ‌త్సం అసాధార‌ణం. ప్ర‌పంచంలో మ‌రే దేశంపైనా ఇంత దాడి చేయ‌లేదు గ‌రిష్టంగా 4 ల‌క్ష‌ల పైచిలుకు కేసులు న‌మోద‌య్యాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనంత‌టికీ ప్ర‌ధాన కార‌ణం డెల్టా వేరియంటే అని అభిప్రాయ‌ప‌డ్డారు నిపుణులు. ద‌క్షిణాఫ్రియా, బ్రిట‌న్‌, బ్రెజిల్ వంటి దేశాల్లో వెలుగు చూసిన వేరియంట్ క‌న్నా.. భార‌త్ లో క‌నుగొన్న ఈ డెల్టా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, దీని కార‌ణంగానే.. దేశంలో క‌రోనా మార‌ణ‌హోమం సృష్టించింద‌ని తేల్చారు.

అయితే.. ఇప్పుడు డెల్టా ప్ల‌స్ వేరియంట్ మ‌రింత ప్ర‌మాద‌క‌రంగా మారింద‌ని హెచ్చ‌రిస్తున్నారు. డెల్టా క‌న్నా ఇది డెల్టా ప్ల‌స్ చాలా ప్ర‌మాద‌క‌రమ‌ని వైట్ హౌస్ హెల్త్ అడ్వైజ‌ర్ ఆంథోనీ ఫౌసీ హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేరియంట్ ఊపిరి తిత్తుల మీద తీవ్ర ప్ర‌భావం చూపుతుందనే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. దేశంలో తొలి మ‌ర‌ణం న‌మోదైంది.

మ‌ధ్యప్ర‌దేశ్ లోని ఉజ్జ‌యినిలో ఓ మ‌హిళ డెల్టా ప్ల‌స్ వేరియంట్ తో ప్రాణాలు కోల్పోయింది. ఈ వేరియంట్ తో ప్రాణాలు కోల్పోయిన తొలి వ్య‌క్తి ఈమే. ఈ రాష్ట్రంలో మొత్తం ఐదుగురిలో ఈ వేరియంట్ ను గుర్తించ‌గా.. ఒక‌రు చ‌నిపోయిన‌ట్టు రాష్ట్ర స‌ర్కారు ప్ర‌క‌టించింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ తోపాటు మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, కేర‌ళ రాష్ట్రాల్లో ఈ వేరియంట్‌ కేసులు న‌మోద‌వుతున్నాయి. దీంతో.. దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ ఆందోళ‌న మొద‌లవుతోంది. థ‌ర్డ్ వేవ్ రావ‌డం త‌థ్యం అనే హెచ్చ‌రిక‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ డెల్టా ప్ల‌స్ ద్వారానే ఇది వ‌స్తుందా? అనే భ‌యాందోళ‌న కూడా కొంద‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని అంటున్నారు.