Begin typing your search above and press return to search.

బెంగుళూరు టెక్కీకి కరోనా ...45 కి చేరిన బాధితుల సంఖ్య !

By:  Tupaki Desk   |   10 March 2020 5:20 AM GMT
బెంగుళూరు టెక్కీకి కరోనా ...45 కి చేరిన బాధితుల సంఖ్య !
X
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3800 మందికిపైగా మరణించగా.. బాధితుల సంఖ్య 1.10 లక్షలకు చేరింది. మొత్తం ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాలకు కరోనా విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కరోనా కారణంగా చైనాలో 3120 మంది చనిపోగా.. చైనా వెలుపల 764 మంది ప్రాణాలు వదిలారు. ఇటలీలో అత్యధికంగా 366 మంది కరోనాకు బలవగా.. ఇరాన్‌లో 237 మంది చనిపోయారు. ఇకపోతే ఈ కరోనా వైరస్ భారత్ లో కూడా రోజురోజుకి మరింతగా వ్యాప్తి చెందుతుండటం తో అందరూ భయంతో వణికిపోతున్నారు.

తాజాగా, మరో రెండు పాజిటివ్ కేసులు వెలుగుచూడటం మరింత ఆందోళనలకు గురిచేస్తోంది. బెంగళూరులో 40 ఏళ్ల ఓ సాఫ్ట్‌ వేర్ ఇంజినీర్ కరోనా కారణంగా రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ డిసీజెస్‌ లో అడ్మిట్ అయ్యారు. ఆయన ఇటీవలే కంపెనీ పనిమీద అమెరికా వెళ్లి వచ్చారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధీర్ తెలిపారు. బాధితుడు మొదట అమెరికాలోని ఆస్టిన్ నగరానికి ప్రయాణించి అక్కడ్నుంచి న్యూయార్క్ దుబాయ్ మీదుగా భారత్ చేరుకున్నట్లు తెలిసింది. కరోనా వైరస్ భయాందోళనల కారణంగా కర్ణాటక లో అంగన్‌వాడీ కేంద్రాలకు వారం రోజులపాటు సెలవులు ప్రకటించారు. ప్రైమరీ స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించారు.

ఇకపోతే , పంజాబ్ రాష్ట్రం లో మరో కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. పంజాబ్ రాష్ట్రం లో తొలిసారి నమోదైన కరోనా కేసు ఇదే కావడం గమనార్హం. ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని పంజాబ్ అధికారులు వెల్లడించారు. దీంతో భారతదేశం లో కరోనా బాధితుల సంఖ్య 45కు చేరింది. ఈ కరోనా వైరస్ భయాందోళనల కారణంగా సోమవారం ఒక్కరోజే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్ల మేర తగ్ గిపోయింది.