Begin typing your search above and press return to search.

ఒక్క‌రికి క‌రోనా... 21 మంది మృతి.. రీజ‌నేంటంటే!

By:  Tupaki Desk   |   9 May 2021 6:32 AM GMT
ఒక్క‌రికి క‌రోనా... 21 మంది మృతి.. రీజ‌నేంటంటే!
X
మ‌నుషుల మ‌ధ్య బంధాల‌ను, సంబంధాల‌ను తెంచేస్తోంది క‌రోనా. క‌రోనా బాధితుడి ఛాయ‌లకు సైతం వెళ్లే ప‌రిస్థితి లేకుండా పోయింది. అంతేకాదు.. క‌రోనాతో మృతి చెందిన వారు మ‌న‌కు ఎంత ఆప్తులైన‌ప్ప టికీ.. ద‌గ్గ‌ర‌గా వెళ్లే ప‌రిస్థితి లేదు. క‌డ‌చూపు క‌రువైపోయిన ప‌రిస్థితి దేశ‌వ్యాప్తంగా క‌నిపిస్తోంది. ఏదో దేశాల్లో.. క‌రోనా మృతుల‌ను అనాథ‌లుగా వ‌దిలేసి వెళ్లిపోయారు.. అని వార్త‌లు.. వ‌స్తే.. అయ్యో.. అని అనుకుని నిట్టూర్చాం. కానీ, ఇప్పుడు ఇదే ప‌రిస్థితి మ‌న ముంగిట్లో దాపురించేస‌రికి.. నోరు పెగ‌ల‌డం లేదు..!

ఇక‌, ప్ర‌భుత్వాలు కూడాక‌రోనాతో మృతి చెందిన వారి అంత్య‌క్రియ‌ల‌కు సంబంధించి అనేక నిబంధ‌న‌లు విధించాయి. ఎవ‌రూ మృత‌దేహాన్ని ముట్టుకోరాద‌ని కూడా స్ప‌ష్టం చేశాయి. అంతేకాదు.. అయిన‌వారికి స‌ద‌రు విగ‌త‌జీవి మృత‌దేహాన్ని కూడా ఇవ్వ‌రాద‌ని ఆదేశాలు ఇచ్చాయి. అంటే.. క‌రోనా ఎంత ప్ర‌మాద‌క రంగా ఉందో అర్ధ‌మవుతోంది.

అయితే.. ఎన్ని నిబంధన‌లు ఉన్న‌ప్ప‌టికీ.. మ‌న అనే మ‌న‌సు కొట్టుకులాడుతుందిగా! అలానే.. రాజ‌స్థాన్ లోనూ ఒక ఘ‌ట‌న జ‌రిగింది. ఇక్క‌డి సికార్ జిల్లాలో ఒక వ్య‌క్తి.. కోవిడ్‌తో మృతి చెందారు. అయితే.. ఈయ‌న అంత్య‌క్రియ‌ల‌ను క‌రోనా నిబంధ‌న‌ల మేర‌కు నిర్వ‌హించాల్సి ఉండ‌గా.. దీనిని పాటించ‌కుండా.. బంధువులు, చుట్టుప‌క్క‌ల వారు పోటెత్తారు. అంతే.. ఇప్పుడు వీరిలో 21 మంది మృతి చెంద‌గా ప‌దుల సంఖ్య‌లో క‌రోనా బాధితులుగా మారారు.

అధికారులు చెప్పిన స‌మాచారం మేర‌కు.. గ‌త ఏప్రిల్ 21న ఖీర్వా గ్రామానికి చెందిన వ్య‌క్తి కోవిడ్‌తో మృతి చెందారు. దీంతో ఆయ‌న మృత‌దేహాన్ని అంత్య‌క్రియ‌ల నిమిత్తం.. గ్రామానికి తెచ్చారు. ఈ తుదివీడ్కోలును ఘ‌నంగా నిర్వ‌హించారు. దాదాపు 150 మంది ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అయితే.. ఈ ఖ‌న‌న కార్య‌క్ర‌మంలో ఎక్క‌డా క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌లేదు.. క‌నీసం భౌతిక దూరం, మాస్కులు ధ‌రించ‌డం కూడా ఆ ఆవేద‌న‌లో మ‌రిచిపోయారు. దీంతో మొత్తాన్ని క‌రోనా ఆవ‌రించింది.

దీంతో 21 మంది చ‌నిపోయారు. మ‌రో ప‌దుల సంఖ్య‌లో క‌రోనాతో బాధ‌ప‌డుతున్నారు. అయితే.. అధికారులు మాత్రం కేవ‌లం ముగ్గురు నుంచి న‌లుగురు మాత్ర‌మే క‌రోనాతో మృతి చెందార‌ని.. మిగిలిన వారు వృద్ధులు కావ‌డంతో ఇత‌ర కార‌ణాల‌తో ప్రాణాలు కోల్పోయార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ల‌క్ష్మ‌ణ్‌గ‌ఢ్ స‌బ్ డివిజ‌న‌ల్ అధికారి క‌ల్‌రాజ్ మీనా ఈ ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు.

ప్ర‌స్తుతం గ్రామాల్లో శానిటైజేష‌న్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. స్థానికులు త‌మ‌కు స‌హ‌క‌రిస్తున్నార‌ని అధికారులు తెలిపారు. కాగా, ఈ గ్రామం.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్య‌క్షుడు గోవింద్ సింగ్ నియోజ‌క‌వ‌ర్గం కింద‌కు వ‌స్తుంది. ప్ర‌స్తుతం ఈ వార్త‌.. సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున వైర‌ల్ అవుతోంది. ఇదే విష‌యాన్ని గోవింద్ సింగ్ ట్వీట్ చేశారు.