Begin typing your search above and press return to search.

వావ్ అసద్.. ఆలయ పూజారికి కరోనా.. ఓవైసీ ఆసుపత్రిలో బెడ్

By:  Tupaki Desk   |   23 April 2021 7:31 AM GMT
వావ్ అసద్.. ఆలయ పూజారికి కరోనా.. ఓవైసీ ఆసుపత్రిలో బెడ్
X
రాజకీయ విభేదాల సహజం. ఎలాంటి వ్యవస్థలో అయినా అలాంటివి మామూలే. విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు రాజకీయాలు.. ఇతర విభేదాల్ని పక్కన పెట్టి సాటి మనిషికి అవసరమైన సాయం చేసేందుకు ముందుకు రావటం.. చొరవ తీసుకోవటం చాలా చాలా అవసరం. ఈ విషయంలో తాజాగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన పని గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు. సాధారణంగా అసద్ రాజకీయ విధానాన్ని చాలామంది వ్యతిరేకిస్తారు. మండిపడతారు. ఆయన మాటల్ని సమర్థించలేమని తేల్చి చెబుతారు.

అలాంటి వారు సైతం.. అసద్ తీరుకు ఫిదా అయ్యేలా తాజా ఉదంతం ఉందని చెప్పాలి. కరోనాతో ఇప్పుడు ఎంతటి దారుణ పరిస్థితి నెలకొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మహానగరంలో ఈ రోజున కరోనా కోసం ఆసుపత్రుల్లో బెడ్లు దొరకని పరిస్థితి. ఇక.. ఆక్సిజన్ సదుపాయం ఉన్న బెడ్డు దొరకటం గగనమే. అలాంటి పరిస్థితుల్లో.. పాతబస్తీలోని ఒక దేవాలయ పూజారి కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

75 ఏళ్ల పెద్ద వయస్కుడైన ఆ పూజారికి కరోనా తీవ్రత ఎక్కువ కావటం.. ఆసుపత్రిలో చేర్చేందుకు కుటుంబ సభ్యులు ఎంతలా ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఎక్కడా పడకలు దక్కకపోవటంతో ఆందోళన చెందుతున్న వేళ.. స్థానిక మజ్లిస్ నేతలకు ఈ విషయం తెలిసింది. వెంటనే వారు ఆలయ పూజారి కుటుంబీకుల్ని తీసుకొని మజ్లిస్ అధినేత అసద్ కు విషయాన్ని వివరించారు.

దీంతో స్పందించిన ఆయన.. శాలిబండలోని తమ ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించి తన ఉదారత చాటుకున్నారు. దీంతో ఆ పూజారి కుటుంబం ఊపిరి పీల్చుకుంది. తాజా ఎపిసోడ్ లో మానవత్వంతో స్పందించిన అసద్ తీరు గురించి తెలిసిన వారంతా తెగ పొగిడేస్తున్నారు. రాజకీయాలు ఎలా అయినా చావనివ్వండి.. సాటి మనిషి పోకుండా సాయం చేయటం చాలా ముఖ్యం. ఆ విషయంలో అసద్ తీరును అభినందించాల్సిందే.