Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ వ్యవధి ఇంగ్లండ్ లో తగ్గిస్తే.. మన దగ్గర పెంచారే

By:  Tupaki Desk   |   30 May 2021 5:30 AM GMT
వ్యాక్సిన్ వ్యవధి ఇంగ్లండ్ లో తగ్గిస్తే.. మన దగ్గర పెంచారే
X
కొవిడ్ 19 సమస్య ఏ ఒక్క దేశానికో చెందింది కాదు. ప్రపంచ దేశాల్ని పట్టి పీడిస్తోంది. కొన్ని దేశాల్లో ఈ వైరస్ అదుపులోకి వస్తే.. మరికొన్ని దేశాల్లో ఇప్పటికి చుక్కలు చూపిస్తోంది. ఇందుకు ఆయా ప్రభుత్వాలు తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో పాటు.. ముందస్తు జాగ్రత్తలు కూడా. వీటన్నింటికి మించి.. ప్రభుత్వ ఆదేశాల్ని పాటించే విషయంలో ప్రజలు ప్రదర్శించే క్రమశిక్షణ కూడా వైరస్ వ్యాప్తిని ప్రభావితం చేసేలా ఉంటుందన్నది మర్చిపోకూడదు.

మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. కరోనాకు సంబంధించిన చక్రం ఒకేలా ఉంటుందన్నది మర్చిపోకూడదు. కరోనా లక్షణాలు.. తీవ్రత.. శరీర వ్యవస్థపై అది దాడి చేసే తీరు అన్ని దేశాల్లో ఇంచుమించు ఒకేలా ఉంటాయి. మ్యూటేషన్ వైరస్ మరింత తీవ్రంగా ఉంటాయి. మరి.. కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పలు దేశాల్లో అమల్లోకి తీసుకొచ్చారు. ప్రజలందరికి టీకాలు వేసే అంశంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.

అయితే.. వ్యాక్సినేషన్ విషయంలో ఒక్కో దేశం ఒక్కోలాంటి వాదనలు వినిపించటం కన్ఫ్యూజింగ్ గా మారింది. ఎందుకంటే.. రెండు డోసుల టీకాకు సంబంధించి.. మొదటి టీకాకు రెండో టీకాకు మధ్య ఉన్న వ్యవధిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటంతో పాటు.. ఒక్కో దేశంలో ఒక్కోలా వ్యవహరిస్తోంది. ఉదాహరణకు బ్రిటన్ ను తీసుకుంటే.. ఆ దేశంలో మొదటి డోస్ కు రెండో డోస్ కు మధ్య వ్యవధి 8-12 వారాల మధ్యకు కుదించారు. అదే సమయంలో మన దేశంలో మాత్రం అందుకు భిన్నంగా 12 - 16 వారాలకు వ్యవధిని పెంచటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.

టీకా రెండో డోసు వేసుకోవటానికి వ్యాక్సినేషన్ వ్యవధిని అంతకంతకూ పెంచటం ఆయా దేశ ప్రభుత్వాలు.. టీకా లభ్యత ఆధారంగా తీసుకుంటున్నారన్న ఆరోపణ ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చూస్తే.. టీకాల మధ్య ఉండాల్సిన వ్యవధి విషయంలో బ్రిటన్ ను ఫాలో కావటం మంచిదని చెబుతున్నారు. మన దగ్గరి మాదిరి రెండో వ్యాక్సిన్ విషయంలో అంత ఎక్కువ వ్యవధి లేకుండా చూసుకోవటం తప్పనిసరి అంటున్నారు. మరీ.. మాటలు ప్రభుత్వానికి వినిపిస్తున్నాయా? అన్నదే అసలు ప్రశ్న.