Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 1 నుండి వారందరికీ కరోనా వ్యాక్సిన్ !

By:  Tupaki Desk   |   23 March 2021 1:02 PM GMT
ఏప్రిల్ 1 నుండి వారందరికీ కరోనా వ్యాక్సిన్ !
X
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతుంది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా శరవేగంగా ముందుకుసాగుతుంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మనం ఇక సేఫ్ అనుకుంటే... టీకా అందుబాటులోకి వచ్చినా కూడా కరోనా కేసులు అయితే భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేసథ్యంలో వ్యాక్సినేషన్ పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందించనున్నట్లు వెల్లడించింది. మంగళవారం సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని, భారత్‌ లో కరోనా వైరస్ టీకాల కొరత లేదని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకునే విషయంలో ఆందోళన అవసరం లేదన్నారు.

అలాగే , దేశంలో ఇప్పటివరకు 4.85 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రి జవదేకర్ తెలిపారు. 80 లక్షల మంది వ్యాక్సిన్ రెండో డోసును కూడా తీసుకున్నారని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 32 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకున్నారని చెప్పారు. ఇక దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో సారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ లాక్‌ డౌన్ విధించే ఆలోచన ఏదైనా ఉందా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఏదీ లేదని ప్రకాశ్ జవదేకర్ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

కొవిషీల్డ్ రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్య ఇవ్వాలని సూచించినట్లు ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తల బృందాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇది కొవిషీల్డ్ టీకాకు మాత్రమేనని తెలిపారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో కేసుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉంది. దీనితో కరోనా నియమాలు పాటిస్తూ మునుపటిలా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారిని మనం జయించవచ్చు.