Begin typing your search above and press return to search.

కరోనా వ్యాక్సిన్ ఆయనను అయస్కాంతంలా మార్చింది!

By:  Tupaki Desk   |   11 Jun 2021 3:30 PM GMT
కరోనా వ్యాక్సిన్ ఆయనను అయస్కాంతంలా మార్చింది!
X
కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతున్న వేళ కొందరిలో దుష్ర్పభావాలు వెలుగుచూస్తున్నాయి. ఒళ్లు నొప్పులు, స్వల్ప జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయి. అయితే రెండు రోజుల్లో వీటి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కానీ మహారాష్ట్ర నాసిక్ కు చెందిన ఓ వ్యక్తి మాత్రం టీకా తనను అయస్కాంతంగా మార్చిందని అంటున్నారు. రెండు డోసులు తీసుకున్న తన శరీరానికి మ్యాగ్నెటిక్ గుణాలు వచ్చాయని చెబుతున్నారు.

నాసిక్ కు చెందిన అరవింద్ సోనార్ టీకా రెండు డోసులు తీసుకున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తన శరీరానికి వస్తువులు అంటుకోవడాన్ని గమనించినట్లు వెల్లడించారు. తొలుత చెమట ద్వారా అనుకున్న తాను ఆ తర్వాత స్నానం చేసి వచ్చినా అలాగే అంటుకుంటున్నాయని చెప్పారు. ఇంట్లోని చిన్న చిన్న స్పూన్లు, నాణాలు, ప్లేట్లను తన శరీరం ఆకర్షిస్తోందని పేర్కొన్నారు.

దీనిపై మహారాష్ట్ర వైద్యులు దృష్టి సారించారు. వ్యాక్సిన్ వల్లే ఇదంతా జరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఆ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపినట్లు వెల్లడించారు. ఆరోగ్య పరీక్షల అనంతరం నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం అవాస్తవమని కొట్టిపారేసింది. టీకా వల్లనే శరీరం అయస్కాంతంలాగా మారిందని నిర్ధారణ కాలేదని స్పష్టం చేసింది.

టీకాల వల్ల శరీరానికి ఎలాంటి అయస్కాంత గుణం ఉండదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది. వ్యాక్సిన్ లో మైక్రో చిప్స్ ఉన్నాయనే వాదనలను కొట్టిపారేసింది. కొందరి శరీరాలు అయస్కాంతంలా పని చేస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని గుర్తు చేశారు. కొవిడ్ టీకాతో ఈ తరహా దుష్ర్పభావాలు లేవని చెబుతున్నారు.