Begin typing your search above and press return to search.

కరోనా వారిని కూడా వదల్లేదు ... అసలు విషయమేంటంటే !

By:  Tupaki Desk   |   12 March 2020 4:30 AM GMT
కరోనా వారిని కూడా వదల్లేదు ... అసలు విషయమేంటంటే !
X
కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్న భయంకరమైన మహమ్మారి. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రభావం . .ఆ తరువాత దేశ దేశాలకి పాకి , ప్రస్తుతం 120 దేశాలలో వ్యాప్తి చెందింది. ఇప్పుడు కరోనా పేరు చెప్తేనే ప్రపంచ దేశాల ప్రజలు హడలిపోతున్నారు. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా 4299 మంది మృత్యువాత పడ్డారు. అలాగే లక్షమందికి పైగా కరోనా వైరస్ తో బాధపడుతున్నారు. ఇకపోతే , ఈ కరోనా చైనాలో కొంచెం తగ్గుముఖం పట్టినా కూడా మిగతా దేశాలలో తన ప్రతాపం చూపిస్తుంది.

ముఖ్యంగా ఇరాన్ , గల్ఫ్ దేశాలలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తుంది. దీనితో ఆ దేశాలలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. అరబ్ దేశాల నుంచి చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొనే దేశాలలో చైనా ఒకటి. కరోనా వ్యాధి విజృంభించడం తో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ విపత్సమయంలోనే సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల విషయమై వాణిజ్య యుద్ధం ప్రారంభమయింది. దీనితో చమురు ఎగుమతిపై ఆధారపడ్డ గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలు అలజడికి గురయ్యాయి. దీనితో తెలుగు ప్రవాసులతో సహా భారతీయులందరికి కష్టాలు మొదలైయ్యాయి.

ప్రస్తుతం గల్ఫ్ దేశాలలోని ప్రతి పట్టణం, నగరంలోనూ జనసందడి తగ్గుముఖం పడుతున్నది. ఇందుకు ఇస్లాం ధార్మిక ప్రదేశమైన మక్కాలోని మస్జీదు పరిసరాలు, దుబాయిలోని విలాసవంతమైన హోటళ్ళులు కూడా మూతపడ్డాయి. అలాగే గల్ఫ్‌లో పెద్ద దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ లు తమ విద్యా సంస్థలకు నిరవధికంగా సెలవులు ప్రకటించాయి అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందొ అర్థంచేసుకోవచ్చు. దీనితో గల్ఫ్ కి వెళ్లే ఎమిరేట్స్ విమానాలలో ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. బోయింగ్ 777 లో గట్టిగ 20 మంది కూడా ప్రయాణించడంలేదు. దీనితో ఎమిరేట్స్ తమ సిబ్బందికి సెలవులు ప్రకటించి , ఇంటికి పంపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని విమాన సర్వీస్ ల పై కరోనా ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

భారత్ నుంచి విమానాల రాకపోకలను కువైత్, ఖతర్ దేశాలు తాత్కాలికంగా నిషేధించాయి. పర్యాటక, ధార్మిక వీసాల జారీని సౌదీ అరేబియా నిలిపివేసింది. గల్ఫ్ దేశాల మధ్య ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఈ ఎడారి దేశాలలో ఇలా ఆంక్షలు విధించడం ఇదే మొదటి సారి. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు. అరబ్ దేశాలలో పెద్దన్న పాత్ర పోషించే సౌదీ అరేబియాకు మిగిలిన అన్ని దేశాలతో రోడ్డు రవాణా వ్యవస్ధ ఉన్నది. కరోనా వైరస్ ప్రమాదంతో ముందు జాగ్రత్త చర్యగా సౌదీ అరేబియా తన సరిహద్దులు మూసివేసింది. దీంతో సౌదీ మార్కెట్‌ పై ఆధారపడ్డ మిగిలిన గల్ఫ్ దేశాలు ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.

కువైట్ లోని తెలుగు ప్రవాసులలో ఆంధ్రప్రదేశ్‌ లోని కడప, చిత్తూరు జిల్లాల వారు చాలా పెద్ద సంఖ్యలో వున్నారు. ఈ ప్రవాసాంధ్రులలో అత్యధికులు చిన్న చితకా ఉద్యోగాలు చేసుకుంటున్నవారే. కరోనా వ్యాధి కారణాన అక్కడ జన సంచారం తగ్గిపోవడంతో వీరందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. దుకాణాలకు అద్దెలు చెల్లించడం కూడ కష్టమవు తుందని పలువురు వాపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే రోజుల్లో మరిన్ని కష్టాలు ఎదురుకావచ్చు అని చెప్తున్నారు. సౌదీ అరేబియా- బహ్రెయిన్‌ ల మధ్య రోడ్డు మార్గం పై రాకపోకలను నిషేధించడంతో సేవల రంగంలో జీవనోపాధి పొందుతున్న తెలంగాణ ప్రవాసులు అనేక మంది వీధుల పాలయ్యారు. చైనా నుంచి దిగుమతులు పూర్తిగా నిలిచి పోవడంతో గల్ఫ్ దేశాలలో అనేక సరుకుల కొరత ఏర్పడింది. వ్యాపారాలు దెబ్బతినడంతో ప్రాంతీయ హబ్‌గా ఉన్న దుబాయి డీలాపడింది. మొత్తంగా గల్ఫ్ దేశాల పై ఆధారపడి బ్రతుకున్న వారి జీవితాలు ఇప్పుడు సంక్షోభంలో పడ్డాయి.