Begin typing your search above and press return to search.

కరోనాతో నెలరోజుల్లో అతలాకుతలమైన భాగ్యనగరం

By:  Tupaki Desk   |   5 April 2020 2:30 AM GMT
కరోనాతో నెలరోజుల్లో అతలాకుతలమైన భాగ్యనగరం
X
కరోనా మహమ్మారి దేశంలోకి అడుగుపెట్టి దాదాపు 40 రోజులైంది. ఇతద దేశాల నుంచి వచ్చిన వారి వలన దేశంలోని కేరళకు తొలిసారి పాకింది. అనంతరం తెలంగాణలో రెండోకేసు వెలుగులోకి వచ్చింది. అది భాగ్యనగరంలో కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి మొదలైన కరోనా వైరస్‌ ఇప్పుడు దాదాపు వందకు పైగా కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. దీంతో హైదరాబాద్‌ తో పాటు శివారు ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతూ జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మార్చి 2వ తేదీన మొదలైన కరోనా కేసులు నేటి వరకు ఆ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్‌వాసులు పెద్దసంఖ్యలో విదేశాలకు వెళ్తుంటారు. వారితో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు విదేశాలకు రాకపోకలు సాగించాలంటే హైదరాబాద్‌ మీదుగానే సాగిస్తున్నారు. అందుకే కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్క తెలంగాణకు చెందిన వారే కాక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు కూడా ఉన్నారు. హైదరాబాద్‌లో విదేశీయులు కూడా నివసిస్తుండడంతో వారి ద్వారా కూడా ఆ వైరస్‌ తెలంగాణలోకి అడుగుపెట్టింది.

అయితే భాగ్యనగరంలో కరోనా వైరస్‌ అడుగుపెట్టింది. నెల దాటింది. మార్చి వారం రోజులుగా ఒకటి రెండుగా పెరుగుతున్న పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒకే రోజు రికార్డు స్థాయిలో 27కు పెరిగింది. దీంతో నగరంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 74కు చేరింది. మేడ్చల్‌,రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 20 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజే 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 60 శాతం కేసులు ఉండడం నగర వాసులను భయ పెడుతోంది. బాధితుల్లో అత్యధికం మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంక్యుబేషన్‌ సమయం దగ్గరపడుతుండటంతో వైరస్‌ బలపడుతోందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో నగర వాసులు అప్రమత్తంగా లేకపోతే పెను ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు. భౌతిక దూరం నిబంధనను మరింత కఠినంగా పాటించాలని సూచిస్తున్నారు.

మార్చి 2వ తేదీన హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు వెలుగులోకి రాగా ఆ తర్వాత సంఖ్య కొంత నెమ్మదిగానే పెరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన సమయంలో కరోనా అదుపులోకి వచ్చింది. అయితే ఈ సమయంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రార్థనకు వెళ్లొచ్చిన వారితో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ప్రస్తుతం నిజామియా ఆస్పత్రిలో 213 మంది, సరోజినీ అస్పత్రిలో 39 మంది, నేచర్‌ క్యూర్‌ అస్పత్రిలో 210మందిని నిజాముద్దీన్‌ వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేశారు. ఫలితాలన్నీ ఒకేసారి రావడంతో పాజిటివ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. మరిన్ని ఫలితాలు రెండు రోజుల్లో రానున్నాయి. దీంతో కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం సుమారు 75 మంది నమూనాలు పరీక్షలకు పంపించగా 27 మందికి పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు చికిత్స పొందుతున్నారు.

అయితే కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌ పట్టణమంతా వెలవెలపోయింది. లాక్‌డౌన్‌తో పాటు కరోనా కేసులు పెరగడంతో ప్రస్తుతం భాగ్యనగరమంతా బోసిపోయింది. హైదరాబాద్‌ నగరం నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండగా.. ఇప్పుడు లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఒక్క దుకాణం కూడా తెరచుకోవడం లేదు. నిత్యావసర దుకాణాలు మినహా హైదరాబాద్‌ మార్కెట్‌ అంతా నిర్మానుష్యంగా మారింది. వాణిజ్య ప్రాంతాలతో పాటు షాపింగ్‌ ఏరియాలన్నీ వెలవెలపోతున్నాయి. ఉస్మాన్‌గంజ్‌, అఫ్జల్‌గంజ్‌, కోఠి, ఆబిడ్స్‌, దిలుసుఖ్‌నగర్‌, అమీర్‌పేట, కూకట్‌పల్లితో పాటు మిగతా ప్రాంతాలు ఎప్పుడు రద్దీగా ఉంటుండగా ఇప్పుడు కళ తప్పాయి.

తెలంగాణలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే అధికంగా ఉన్నాయి. మరణాల్లో కూడా అధికంగా ఉంటున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వెంటనే కరోనా నివారణకు చర్యలు తీసుకుంటుండగా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. నెల రోజులు హైదరాబాద్‌ నగరం చిన్నబోయింది. ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్లు, ఆయా ప్రాంతాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్‌వాసీలు ఇళ్లకే పరిమితమవడం చూస్తుంటే ఎంతటి పరిస్థితి వచ్చిందోనని పత్రికలు, టీవీల్లో చూస్తూ భాగ్యనగరవాసులు ఆవేదన చెందుతున్నారు.