Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   4 March 2020 4:26 AM GMT
కరోనా వేళ.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
X
హైదరాబాద్ కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావటంతో హైదరాబాద్ మహా నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎవరికి వారు ఈ మాయదారి మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల ఏమిటన్న దానిపై ఫోకస్ చేస్తున్నారు. రద్దీ ప్రదేశాల్లో ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందే వీలు ఉండటంతో.. అలాంటి చోట్ల ముందస్తు జాగ్రత్తల ఏమేం తీసుకోవాలన్న అంశంపై ఆయా సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో అధికారులు అలెర్ట్ అయ్యారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా మెట్రో సిబ్బంది కి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వటం షురూ చేశారు. కరోనా నేపథ్యం లో ఏం చేయాలి? ఏం చేయకూడదన్న అంశంపై సిబ్బందికి స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు.

నిత్యం వేలాది మంది మెట్రో స్టేషన్ల ద్వారా మహా నగరంలో ప్రయాణిస్తున్న నేపథ్యం లో.. స్టేషన్ కు వచ్చే ప్రయాణికుల్లో ఎవరైనా అనారోగ్య లక్షణాలతో కనిపిస్తే.. వారి వివరాలు వెంటనే రిపోర్టు చేయాలని కోరారు. అంతేకాదు.. మెట్రో స్టేషన్లలో శుభ్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఎవరూ లేని సమయంలో ఎప్పటికప్పుడు మెట్రో స్టేషన్లను.. రైళ్ల కోచ్ లను.. ఎస్కలేటర్స్ ను శానిటైజర్స్ తో క్లీన్ చేయాలని అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ తాజా పరిస్థితి ని ఎప్పటికప్పుడు సమీక్షస్తున్నట్లుగా మెట్రో ఎండీ స్పష్టం చేశారు. మొత్తంగా కరోనా వేళ.. హైదరాబాద్ మెట్రో ఫుల్ అలెర్ట్ గా ఉన్నామన్న విషయాన్ని తమ తాజా ప్రకటన తో చెప్పేశారని చెప్పాలి.