Begin typing your search above and press return to search.

కరోనా పై చేతులెత్తేసిన అమెరికా.. లక్ష కేసులు.. వెంటిలేటర్ల కొరత

By:  Tupaki Desk   |   28 March 2020 3:55 AM GMT
కరోనా పై చేతులెత్తేసిన అమెరికా.. లక్ష కేసులు.. వెంటిలేటర్ల కొరత
X
అగ్రరాజ్యం.. ప్రపంచంలోనే అత్యాధునిక వైద్య సదుపాయాలున్న దేశం అమెరికా. ఏ దేశంలో ఆపద అన్నా ముందుకొచ్చి ఆదుకునే దేశం. ఇప్పుడు దక్షిణ కొరియా లాంటి చిన్న దేశం సహాయం అర్థించాల్సిన దుస్థితికి దిగజారింది. దీనికంతటికి కారణం ‘కరోనా వైరస్’. అంతటి ప్రపంచ పెద్దన్న ఇప్పుడు కరోనా వైరస్ కు అతలాకుతలం అవుతోంది. పరిస్థితి చేయిదాటిపోతోంది.

కరోనాతో అమెరికాలో మరణ మృందంగం వినిపిస్తోంది. ఇటలీ తర్వాత కరోనా అమెరికాను ఆవహించింది. అక్కడి ప్రజల ప్రాణాలను పెద్ద ఎత్తున తీస్తోంది. ఇప్పటికే అమెరికాలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 1700 దాటింది. దాదాపు లక్ష మందికి పైగా కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్నారు.

అమెరికాలో రోజురోజుకు రోగుల సంఖ్య పెరుగుతుండడం.. సరిపడా వెంటిలేటర్ల కొరతతో చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. వైద్యులు, మెడికల్ సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అమెరికాలో కరోనా వైరస్ కు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. చికిత్స కోసం ఆస్పత్రులు సరిపోవడం లేదు. తగినంత సిబ్బంది లేరు. అమెరికా లో వెంటీలేటర్లు తక్కువగా ఉండడంతో ఊపిరి అందక జనాలు మరణిస్తున్నారు.

న్యూయార్క్, న్యూ ఓర్లీన్స్, డెట్రాయిట్ వంటి నగరాల్లో హాస్పిటల్స్ లో మందులు, పరికరాల కొరత తీవ్రంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే 16వేల మంది బాధుతుండగా.. 24 గంటల్లో వారి సంఖ్య 1,02,000కు చేరుకోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో రోగుల సంఖ్యలో చైనా, ఇటలీని అమెరికా మించిపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.

అమెరికాలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 17వేలకు చేరువ అవుతోంది. ఒక్కరోజే 300 మంది మరణించారు. పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

మాస్కుల కొరతతో పేపర్ తో తయారు చేసిన మాస్కులను వాడుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగి అతిపెద్ద వాహన తయారీ సంస్థ జనరల్ మోటార్స్ ను వెంటనే వెంటీలేటర్స్ తయారు చేయాలని ట్రంప్ ఆదేశించారు. నేషనల్ ఎమెర్జెన్సీ సమయంలో పరిశ్రమలపై పూర్తి హక్కు అధ్యక్షుడికే ఉంటాయి. అందుకే మాస్కులు, పరికరాలు తయారీకి ట్రంప్ ఆదేశించారు.