Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్: స్వదేశానికి వెళ్లం..భారత్ లోనే ఉంటామంటున్న అమెరికన్లు

By:  Tupaki Desk   |   8 April 2020 8:50 AM GMT
కరోనా ఎఫెక్ట్: స్వదేశానికి వెళ్లం..భారత్ లోనే ఉంటామంటున్న అమెరికన్లు
X
వినేందుకు విచిత్రంగా ఉన్న ఇది నిజం. కష్టంలో ఉన్నప్పుడు.. విపత్కర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు తొలుత గుర్తుకు వచ్చేది అయినోళ్లు. తర్వాత సొంతూరు. ఎక్కడిదాకానో ఎందుకు? కరోనా వేళ.. దేశంలో నగరాల్లో ఉన్న వారంతా తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లటానికి చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కొందరు వలస కూలీలు అయితే.. రవాణా సౌకర్యం లేకున్నా కాలి నడకన వందల కిలోమీటర్లు నడుచుకుంటూ ఊళ్లకు వెళ్లిపోయారు. అలాంటిది దేశం కాని దేశంలో ఉన్నప్పుడు తమ దేశానికి వెళ్లిపోవాలని అనుకోవటం చూస్తుంటాం.

పలు దేశాల్లో చిక్కుకున్న మనోళ్లు.. దేశానికి తిరిగి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఇందుకు భిన్నంగా అమెరికన్లు మాత్రం తమ దేశానికి వెళ్లటానికి ససేమిరా అంటున్నారు. అమెరికాకు వెళ్లటం కంటే భారత్ లోనే ఉండిపోవటం సేఫ్ అని వారు భావించటం విశేషం. వివిధ పనుల మీద భారత్ కు వచ్చిన అమెరికన్లు.. ఇప్పుడు వారి దేశానికి తిరిగి వెళ్లేందుకు ఆసక్తిని చూపించటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనాకేసులు నమోదు కావటం.. అమెరికాలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉండటం తెలిసిందే.

ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లే కన్నా భారత్ లో ఉండిపోవటం బెటరన్న భావనలో అమెరికన్లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని అమెరికా కాన్సులేట్ వ్యవహారాలు చూసే అధికారులు చెబుతున్నారు. విదేశాల్లో చిక్కుకు పోయిన అమెరికన్లను స్వదేశానికి తీసుకు రావటానికి అమెరికా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇదిలా ఉంటే.. అమెరికాకు వెళ్లే కంటే భారత్ లో ఉండటానికి మొగ్గు చూపుతున్న వారు ఎక్కువగా ఉన్నారని.. అది వారిష్టంగా చెబుతున్నారు. ఏమైనా.. కరోనా కాలంలో సొంత దేశం కంటే భారతదేశమే పదిలమన్న భావనలో అమెరికన్లు ఉండటం గమనార్హం.