Begin typing your search above and press return to search.

అమెరికాలో 20 సెకన్లకు ఒకరు బలి.. రోజులో ఎంతమందంటే?

By:  Tupaki Desk   |   18 April 2020 4:45 AM GMT
అమెరికాలో 20 సెకన్లకు ఒకరు బలి.. రోజులో ఎంతమందంటే?
X
కరోనాను పిశాచితో పోల్చిన చైనా అధ్యక్షుడి మాటలో నిజం ఎంతన్నది ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా తాజా పరిస్థితి చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కేవలం ఇరవై సెకన్లకు ఒకరు చొప్పున అమెరికాలో చోటు చేసుకుంటున్న కరోనా మరణాలు ఇప్పుడా దేశాన్ని దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. గురువారంతో పోలిస్తే.. శుక్రవారం నాడు చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడా దేశం ఎంతటి దారుణ పరిస్థితుల్లో ఉందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా చేస్తోంది.

అమెరికాలో గురువారం రోజున (24 గంటల వ్యవధిలో) 2569 మంది కరోనా కారణంగా ప్రాణాలు వదిలితే.. కేవలం రోజు వ్యవధిలో శుక్రవారం(24 గంటల వ్యవధిలో) ఒక్కరోజులోనే 4591 మంది మరణించటం ఏ మాత్రం మింగుడుపడని రీతిలో మారింది. దీంతో.. అమెరికాలో ఇప్పటివరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 35వేలకు పెరిగింది. న్యూయార్క్.. న్యూజెర్సీ.. కనెక్టికట్ లో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఒక్క న్యూయార్కులోనే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 16వేలకు చేరుకోవటం గమనార్హం.

ఒక మహానగరంలో ఇన్ని వేలమంది ఒక అంటువ్యాధికి బలి కావటం ఆధునిక సమాజంలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు. కరోనా కారణంగా అమెరికాలో మరణిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. షాకింగ్ అంశం ఏమంటే.. నిమిషానికి ముగ్గురు చొప్పున.. అంటే ప్రతి ఇరవై సెకన్లకు ఒకరు చొప్పున అమెరికాన్లు మరణిస్తున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 30 శాతమ ఆఫ్రికన్ అమెరికన్లకే కరోనా సోకటం గమనార్హం.

కరోనాను కట్టడి చేయకుంటే లక్ష నుంచి 2.40 లక్షల మంది వరకూ మరణించే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే.. కరోనాను సరైన సమయంలో కట్టడి చేయకుంటే ఒక్క ఆఫ్రికాలోనే మూడు లక్షల మంది ప్రజలు మరణిస్తారని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు 7 లక్షలకు చేరువైంది. ఇదే తీవ్రత కొనసాగితే.. మరికొద్ది రోజుల వ్యవధిలోనే పాజిటివ్ కేసులు పది లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా 22.17లక్షల కేసులు నమోదు కాగా.. 1.51లక్షల మంది ఇప్పటివరకూ మరణించారు. శుక్రవారం ఒక్కరోజులోనే ప్రపంచ వ్యాప్తంగా 55,438 కేసులు కొత్తవి నమోదయ్యాయి. ఇక.. మన దేశానికి వస్తే కొత్త కేసులు 1076 కాగా.. మొత్తం కేసుల సంఖ్య 13,835గా చెబుతున్నారు. ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 452కు చేరింది. తెలంగాణలో శుక్రవారం ఒక్కరోజులోనే 66 మందికి పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఏపీలో 38కేసులు మాత్రమే నమోదయ్యాయి. తెలంగాణ లో మొత్తం కేసులు 766 కాగా.. ఏపీలో 572కు చేరుకున్నాయి. తెలంగాణలో 18 మంది మరణిస్తే.. ఏపీలో ఈ సంఖ్య 14కు పరిమితమైంది. ఏమైనా.. రానున్న రోజులు మరింత కష్టంగా.. క్లిష్టంగా మారే అవకాశం ఉందని చెప్పకతప్పదు.