Begin typing your search above and press return to search.

అవును ఆ అవకాశమైతే ఉంది ..కానీ ఏంచేస్తాం : ట్రంప్ !

By:  Tupaki Desk   |   6 May 2020 1:40 PM IST
అవును ఆ అవకాశమైతే ఉంది ..కానీ ఏంచేస్తాం : ట్రంప్ !
X
డోనాల్డ్ ట్రంప్... ఈయన వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నలుగురు వెళ్లేదారిలో ట్రంప్ నడవరు. అయననది ఒక ప్రత్యేకమైన శైలి. అయితే ఏదైనా విపత్తు వచ్చినప్పుడైనా ట్రంపు వ్యవహారశైలి మారుతుంది అని అనుకున్నారు. కానీ ఈ మహమ్మారి ఇంతలా అమెరికాను పట్టిపీడిస్తున్న కూడా ట్రంప్ వ్యవహార శైలిలో మార్పు రాలేదు. ఇప్పటికీ కూడా కరోన పై గట్టి చర్యలు తీసుకోవడం లేదు. ప్రాణాంతక కరోనా వైరస్‌ ధాటికి అగ్రరాజ్యంలో ఇప్పటికే 70 వేల మందికి పైగా మృత్యువాత పడగా.. లక్షలాది మందికి వైరస్‌ సోకింది. ఈ క్రమంలో కరోనా సంక్షోభం వల్ల అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు అమెరికా ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో పాటుగా కొన్ని రాష్ట్రాలలో కొన్ని పూర్తిగా ఎత్తివేసి కార్యకలాపాలు మొదలు పెట్టాలని చెప్పాడు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ తొలిసారిగా మంగళవారం అరిజోనాలో ఉన్న ఫోనిక్స్‌లో గల హనీవెల్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. మాస్కులు తయారీ చేస్తున్న సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా సామాజిక ఎడబాటు నిబంధనలను సడలించి... ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడం వల్ల కరోనా మృతులు పెరిగే అవకాశం ఉంది కదా విలేకరులు ప్రశ్నించగా.. ‘అవును ఆ అవకాశమైతే ఉంది. మనం అపార్టుమెంటులోనో, ఇంట్లోనో లాక్‌ చేసుకుని ఉండలేం కదా. కరోనా ప్రభావం ఉంటుందని తెలుసు. అయితే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం కూడా ముఖ్యమే’అని ట్రంప్‌ సమాధానమిచ్చారు. కాగా మాస్కుల తయారీ కర్మాగారాన్ని సందర్శించిన సమయంలోనూ ట్రంప్‌ మాస్కు ధరించకపోవడం గమనార్హం.

కరోనా పోరులో ముందుండే వైద్య సిబ్బంది కోసం తయారు చేసిన మాస్కులను విలేకరుల ముందు ప్రదర్శించిన ట్రంప్‌.. తాను పెట్టుకునేందుకు మాస్కు ఇవ్వబోతున్న ఫ్యాక్టరీ సిబ్బందిని వారించారు. దీంతో ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుత స్థానంలో ఉండి కనీస జాగ్రత్తలు పాటించకుండా ట్రంప్‌ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తున్నారని ప్రతిపక్షం విమర్శిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించకుంది. ఇదిలా ఉండగా.. శ్వేతసౌధ వర్గాలు మాత్రం మాస్కు విషయంలో ట్రంప్‌ వ్యవహారశైలిని వెనకేసుకొచ్చాయి. ట్రంప్‌ సహా ఇతర ఉన్నత అధికారులు తరచుగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్న కారణంగా అంతగా భయపడాల్సిన పనేం లేదని చెప్పుకొచ్చాయి.