Begin typing your search above and press return to search.

ఏపీలో అనుమానిత కేసులు పెరుగుతున్నాయ్.. బీ అలెర్ట్

By:  Tupaki Desk   |   18 March 2020 4:15 AM GMT
ఏపీలో అనుమానిత కేసులు పెరుగుతున్నాయ్.. బీ అలెర్ట్
X
సర్వత్రా వ్యాపించిన కరోనా భయం అంతకంతకూ విస్తరిస్తోంది. చైనాలో స్టార్ట్ అయి.. చూస్తుండగానే యావత్ ప్రపంచాన్ని చుట్టేయటమే కాదు.. కొన్నిదేశాల్లో దారుణమైన పరిస్థితులకు ఈ సూక్ష్మజీవి కారణమైంది. ప్రపంచం సంగతి పక్కన పెట్టి.. మన దేశంలో.. అందునా తమ తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఐదు కేసులు (ఒక కేసు విషయంలో స్వస్థత పొంది డిశ్చార్జ్ అయ్యారు కూడా) నమోదు కాగా.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకూ ఒక కేసు మాత్రమే నమోదైంది.

ఇదంతా చూస్తున్నప్పుడు బాగానే ఉన్నా.. పెను ప్రమాదం పొంచి ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఏపీలో కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా అనుమానిత కేసులు పెద్దగా లేనప్పటికీ.. గడిచిన ఒకట్రెండు రోజుల్లో అనుమానిత కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతానికి ఇది కాస్తా 22కు చేరుకోవటం ఆందోళనను కలిగిస్తోంది. దేశంలో కరోనా వైరస్ రెండో దశలోకి అడుగు పెట్టిందన్న అధికారిక ప్రకటనతో అనుమానితుల సంఖ్య పెరిగే కొద్దీ ఆందోళన పెరిగిపోతోంది. దీనికి తోడు.. ఏపీలో పెరుగుతున్న అనుమానితులు నివసిస్తున్న జిల్లాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఎప్పుడేం జరుగుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

మంగళవారం నాటికి ఏపీలో మొత్తం 22 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. వీటిలో విశాఖలో ఐదు.. కాకినాడలో రెండు.. ఏలూరులో ఒకటి.. నెల్లూరులో ఐదు.. చిత్తూరు జిల్లాలో ఐదు.. మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున అనుమానితులుగా ఉండటం గమనార్హం. దీంతో.. ఒకవేళ.. ఈ కేసుల్లో కొన్ని అయినా పాజిటివ్ గా తేలితే.. ఏపీలో కరోనా వ్యాప్తి చాపకింద నీరులా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనా వైరస్ ప్రభావం మొదలై నాటి నుంచి ఏపీలో ఇప్పటివరకూ వంద మంది నుంచి నమూనాలు సేకరించారు. అయితే.. గతంలో లేని ఆందోళన తాజాగా చోటు చేసుకోవటం వెనుక.. వివిధ దేశాల నుంచి వచ్చిన వారు వారి స్వప్రాంతాలకు వచ్చేయటంతో.. కరోనా భయాందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా వైరస్ ను నిలువరించటం లో కాస్తంత వెనుకబడి ఉందన్న అభిప్రాయం పెరుగుతోంది.

కరోనా వైరస్ ప్రభావం రానున్న రోజుల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న భావనను ఏపీ ప్రభుత్వం వ్యక్తం చేస్తుందని.. కానీ దాన్ని అరికట్టే విషయానికి అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఏమైనా.. ప్రస్తుతం అనుమానితులుగా ఉన్న 22 మందిలో పాజిటివ్ కేసులు ఎన్ని అన్న విషయం తేలే దానికి అనుగుణంగా ఏపీలో ఈ మహ్మమారి ఎంతమేర ప్రభావం చూపిస్తుందన్న విషయంపై స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.