Begin typing your search above and press return to search.

ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ ...బాధితుడి కుటుంబ సభ్యులే కావడంతో సేఫ్ !

By:  Tupaki Desk   |   30 March 2020 6:25 AM GMT
ఏపీలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ ...బాధితుడి కుటుంబ సభ్యులే కావడంతో సేఫ్ !
X
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. తాజాగా మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రంలో కరోనా భాదితుల సంఖ్య 21 కి చేరింది. అయితే , తాజాగా నమోదైన రెండు కొత్త కేసులు కూడా .. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఇది కొద్దిగా ఊరట కలిగించే అంశం. తాజాగా కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు కూడా విశాఖ వాసులే.

ఇంగ్లాండ్‌ లోని బర్మింగ్‌ హామ్‌ నుంచి స్వస్థలానికి వచ్చిన ఓ యువకుడికి ఇప్పటికే కరోనా వైరస్ సోకింది. అతనికి కరోనా సోకింది అని తెలియగానే ..హాస్పిటల్ కి తరలించి కరోనా కి చికిత్స అందిస్తున్నారు. అయితే , అనుమానం వచ్చి, ఆయన కుటుంబ సభ్యులకు రక్త పరీక్షలను నిర్వహించగా.. వారిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వారిని విశాఖపట్నం ఇన్‌ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనితో ఆ యువకుడి కుటుంబ సభ్యుల్లో మొత్తం ముగ్గురు కరోనా వైరస్ బారిన పడ్డారు. బర్మింగ్‌ హామ్ నుంచి ఈ నెల 17వ తేదీన స్వస్థలానికి చేరుకున్న ఆ యువకుడు కొద్దిరోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో గడిపారు. ఆ సమయంలోనే ఆయన నుంచి కుటుంబ సభ్యులకు వైరస్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ముగ్గురి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్తున్నారు.

కొత్తగా నమోదైన ఈ రెండు కేసులతో ఒక్క విశాఖపట్నంలోనే కరోనా వైరస్ పాజటివ్‌గా తేలిన కేసుల సంఖ్య ఆరుకు పెరిగింది. ఈ ఆరుమంది పేషెంట్లలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం కొద్దిగా ఊరట కలిగించే విషయమని అధికారులు చెబుతున్నారు. బయటి వ్యక్తులెవరూ ఈ వైరస్ బారిన పడకపోవడం వల్ల పేషెంట్ల ట్రాకింగ్ సులభం అవుతుంది అని అంటున్నారు. బర్మింగ్‌ హామ్ నుంచి వచ్చిన యువకుడి సమాచారాన్ని వార్డు వలంటీర్లు వెంటనే కనిపెట్టి ప్రభుత్వానికి తెలిపారని ,దీనితో చాలా తక్కువ మందికి ఈ వ్యాధి సోకింది అని తెలిపారు. మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 21 కరోనా కేసులు నమోదు కాగా ...వారిలో ఇద్దరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.