Begin typing your search above and press return to search.

ఏపీలో ఘోరం.. వైద్యం అందక బాలుడు మృతి

By:  Tupaki Desk   |   30 March 2020 10:30 AM GMT
ఏపీలో ఘోరం.. వైద్యం అందక బాలుడు మృతి
X
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి తిండి దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పాటు వలస వెళ్లిన కూలీలు వాహనాలు లేక వందల కిలోమీటర్ల మేర కాలి నడకన తమ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ బాలుడు వైద్య సేవలు సకాలంలో అందక మృతిచెందిన ఘటన కలవరంతో పాటు కన్నీరు పెట్టిస్తోంది. అనారోగ్యానికి గురైన ఆ బాలుడికి లాక్‌డౌన్‌ నేపథ్యంలో పెద్దాస్పత్రికి తీసుకెళ్లలేని పరిస్థితి ఏర్పడగా.. ఆ బాలుడు అనారోగ్యంతో పోరాడుతూ మృతిచెందిన సంఘటన అనంతపురము జిల్లాలో చోటుచేసుకుంది.

అనంతపురము జిల్లా గోరంట్ల పట్టణంలో మనోహర, తన భార్యా ముగ్గురు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. చెత్త ఏరుకుంటూ ప్లాస్టిక్‌ సీసాలు, పేపర్లు భర్త విక్రయిస్తుంటే భార్యాపిల్లలు భిక్షాటన చేసి పొట్ట నింపుకుంటున్నారు. అయితే కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మార్చి 20వ తేదీన వారి కుమారుడు దేవ అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో వెంటనే గోరంట్లలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరీక్షించిన వైద్యులు వెంటనే కుమారుడిని హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని సిఫారసు చేశారు. మార్చి 22వ తేదీ ఆదివారం దేశంలో జనతా కర్ఫ్యూ విధించారు. చేతిలో రూపాయి లేదు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో హిందూపురం వెళ్లలేని పరిస్థితి. ఆ కష్టాన్ని చూసిన అక్కడి వారు తలా కొంత సహాయం చేయగా మొత్తం రూ.1,700 పోగయ్యాయి. ఆ డబ్బుతో అష్టకష్టాలు పడుతూ గోరంట్ల నుంచి హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చేరారు. తమ కుమారుడు దేవను వైద్యులకు చూయించారు. అక్కడి వైద్యులు పరిశీలించి కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని అనంతపురము లేదా బెంగళూరు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

అయితే అప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. దీంతో రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలు ఏం నడవడం లేదు. అంబులెన్స్‌లను సంప్రదిస్తే అంత దూరం రాలేమని తేల్చి చెప్పారు. 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేస్తే తమకు ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేస్తేనే వస్తామని బదులిచ్చారంట. ఆటోలు, ఇతర వాహనాలు నడవడం లేదు. కొందరు వచ్చేందుకు సిద్ధంగా రూ.వేలల్లో అడుగుతుండడంతో ఆయన ఇచ్చుకోలేని పరిస్థితి. చేతిలో రూ.1,500 మాత్రమే ఉన్నాయి. దీంతో అనంతపురము, బెంగళూరు తీసుకెళ్లలేక గోరంట్లకు వచ్చి ఇంట్లోనే కుమారుడిని ఉంచుకున్నాడు. తాజాగా ఆ బాలుడి పరిస్థితి విషమించి కన్నుమూశాడు.

అయితే కుమారుడి మృతదేహాన్ని శ్మశానం తీసుకెళ్లాలంటే కూడా ఎవరూ ముందుకు రాలేదు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలెవరూ లేకపోవడంతో ఆయన తన భార్యా పిల్లలతో కలిసి కుమారుడి మృతదేహాన్ని చేతులపై మోసుకుంటూ శ్మశానానికి వెళ్లాడు. శ్మశానం కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించిన ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తోంది. ఈ విధంగా పేదలు కష్టాలు పడుతున్నారు. అయితే ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యావసర సమయంలో అంబులెన్స్‌ లు అందుబాటులో లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యం విషయంలో కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నారు.