Begin typing your search above and press return to search.

సౌత్ కొరియా సీన్ ఏపీలోనూ రిపీట్ కానుందా?

By:  Tupaki Desk   |   29 April 2020 12:30 AM GMT
సౌత్ కొరియా సీన్ ఏపీలోనూ రిపీట్ కానుందా?
X
తాత్కాలిక ఆనందం కంటే.. శాస్త్రీయంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు చాలా ముఖ్యం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఫుల్ క్లారిటీతో ఉంది. కరోనాపై ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి. కంటికి కనిపించని రీతిలో దెబ్బ తీస్తున్న వైరస్ మహమ్మారి అంతు చూసేందుకు ఒక్కో దేశం ఒక్కోలా వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఒకే దేశంలోని రాష్ట్రాలు ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరిస్తున్నారు. పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. పలువురు ఏపీ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం ధీమాగా ఉన్నారు. ఎందుకిలా? అంటే.. వ్యూహాత్మకంగా ముందుకెళుతున్న ఏపీ సర్కారు.. కొత్తగా వెలుగు చూస్తున్న కేసులకు ఏ మాత్రం కంగారు పడటం లేదు.

ఆ మాటకు వస్తే.. కేసుల తీవ్రత బయటపడేలా పెద్ద ఎత్తున కరోనా నిర్దారణ పరీక్షల్ని మరింతగా ముమ్మరం చేస్తుండటం గమనార్హం. ఇందుకు కారణంగా.. కరోనా సంగతి చూసే విషయంలో సౌత్ కొరియా అనుసరించిన మోడల్ ను తాజాగా ఏపీ సర్కారు ఫాలో అవుతోందన్న మాట వినిపిస్తోంది. ఇంతకీ కరోనా విషయంలో సౌత్ కొరియా అనుసరించిన విధానం ఏమిటి? అన్న విషయంలోకి వెళితే.. ఆ దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఒక దశలో ఆ దేశంలో రోజుకు 800 కేసులు నమోదయ్యేవి. అయినప్పటికీ కంగారుపడకుండా.. వైరస్ నిర్దారణపరీక్షల్ని పెద్ద ఎత్తున నిర్వహించేవారు.
అలా బయటకు వచ్చిన కేసుల్ని జాగ్రత్తగా డీల్ చేయటమే కాదు.. క్వారంటైన్ లో ఉంచి చికిత్స చేసేవారు. కట్టుదిట్టమైన వ్యూహాన్ని అమలు చేయటం ద్వారా వేగంగా విస్తరించే కరోనా కేసుల్ని తక్కువ సమయంలోనే కంట్రోల్ చేయటంతో.. సౌత్ కొరియా మోడల్ వైపు ప్రపంచ దేశాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పుడు ఇదే బాటలో ఏపీ సాగుతోంది.

దక్షిణ కొరియాలో తొలికేసు జనవరి 19న నమోదైంది. ఫిబ్రవరి 18 వరకు ఆ దేశంలో కేవలం 30 కేసులు మాత్రమే నమోదయ్యాయి. తర్వాత పది రోజుల్లోనే 2,300 కేసులు పెరిగాయి. దీనికి కారణం కరోనా సోకిన వ్యక్తి మిగిలిన వారికి అంటించటమే. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం వైరస్ కంటే వేగంగా.. నిర్దారణ పరీక్షలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. దేశంలోని వ్యక్తుల డెబిట్ కార్డులు.. సెల్ ఫోన్.. సీసీ కెమేరాల సాయంతో పాజిటివ్ వ్యక్తితో కాంటాక్టుఅయిన వారందరికి పరీక్షలు నిర్వహించారు.

నిర్దారణ పరీక్షలసంఖ్య పెరిగే కొద్ది కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ఒకదశలో ఒకే రోజున 800పైగా కేసులు నమోదయ్యాయి. ఇలా పెరుగుతూ వెళ్లిన కేసులు మార్చి చివరి నాటికి కంట్రోల్ లోకి వచ్చింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటంతో కేసుల సంఖ్య వందకు తగ్గటమే కాదు.. సింగిల్ డిజిట్ కు కేసులు దిగి వచ్చాయి. ఏపీలోనూ అదే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఎందుకంటే మార్చి 12న ఏపీలో తొలికేసు నెల్లూరు జిల్లాలో నమోదైంది. మర్కజ్ ఎపిసోడ్ తో కేసుల సంఖ్య మరింతగా పెరిగి పోయింది.

వైరస్ వచ్చిన ప్రైమరీ కాంటాక్టుతో పాటు.. ఫస్ట్ కాంటాక్టును గుర్తిస్తూ పరీక్షలు జరుపుతున్నారు. ఒకే మండలంలో నాలుగు కేసుల కంటే ఎక్కువగా నమోదైతే.. దాన్ని రెడ్ జోన్ గా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో.. ప్రాథమికంగా కేసులు ఎక్కువగా నమోదైనట్లు కనిపించినా.. మే నాటికి రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి రావటం ఖాయమంటున్నారు. ప్రైమరీ కాంటాక్టుతో పాటు.. ఫస్ట్ కాంటాక్టు అయిన వారిని గుర్తించుకుంటూ వెళుతున్న నేపథ్యంలో పరిస్థితులు త్వరలోనే చక్కబడే అవకాశం ఉందన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.