Begin typing your search above and press return to search.

ఏపీ ఇప్పుడు ఆ మూడు దేశాల మాదిరి మారిందట

By:  Tupaki Desk   |   29 April 2020 3:45 AM GMT
ఏపీ ఇప్పుడు ఆ మూడు దేశాల మాదిరి మారిందట
X
లేటుగా వచ్చిన లేటెస్టుగా వచ్చా అన్నట్లుగా ఏపీలో కరోనా వైరస్ విరుచుకుపడుతోంది. ఇరుగున ఉన్న తెలంగాణ కంటే ఆలస్యంగా తొలి పాజిటివ్ కేసు నమోదైనా.. ఇటీవల కాలంలో వైరస్ అంతకంతకూ వ్యాపించటమే కాదు.. ఏపీలోని మూడు పట్టణాల్లో విరుచుకుపడుతున్న వైనంతో ఏపీ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజు గడుస్తున్న కొద్దీ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఏపీలో నమోదైన కరోనా కేసులు 1259కు చేరుకున్నాయి. ఈ కేసుల్లో 70 శాతం మూడు పట్టణాల్లోనే ఉండటం గమనార్హం.

38 రోజుల్లో 603 కేసులు నమోదైతే.. గడిచిన మూడు రోజుల్లో ఏకంగా 243 కేసులు నమోదు కావటంతో.. రాష్ట్రంలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 అంకెను దాటేసింది. దక్షిణాదిన మరే రాష్ట్రంలో లేని విధంగా మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటాన్ని అధికారులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితిని చూస్తే.. రాష్ట్రంలో అమెరికా.. స్పెయిన్.. ఫ్రాన్స్ దేశాల్లో నెలకొన్న పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ దేశాల్లో ఎలా అయితే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందో.. అదే రీతిలో ఏపీలోని మూడు జిల్లాలు (కర్నూలు.. గుంటూరు.. క్రిష్ణా) ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా నమోదైన కేసుల లెక్క ప్రకారం చూస్తే కర్నూలు జిల్లాలో 332 కేసులు నమోదైతే.. గుంటూరులో 254 కేసులు నమోదయ్యాయి. ఇక క్రిష్ణా జిల్లాలో 223 కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో అతి పెద్ద రిలీఫ్ ఏమంటే.. మరణాల సంఖ్య తక్కువగా ఉండటం.

మంగళవారం ఒక్కరోజులో కర్నూలులో 40 కొత్త కేసులు నమోదు కాగా.. గుంటూరులో 17.. క్రిష్ణాలో 13 కేసులు నమోదయ్యాయి. ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితిపై సోషల్ మీడియాలో చురకల తీవ్రత పెరుగుతోంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ లా మారుస్తానని చెబితే.. జగన్ మాత్రం మాట వరసకు చెప్పకుండానే ఏపీని అమెరికా.. స్పెయిన్.. ఫ్రాన్సు మాదిరి మార్చేశారంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు.

కరోనా నిర్దారణ పరీక్షలు పెద్ద ఎత్తున చేయటంతోనే ఇలాంటి పరిస్థితి నెలకొందని.. మిగిలిన రాష్ట్రాల్లో అలాంటివేమీ చేయట్లేదని.. ఈ కారణంగానే కేసులు బయటకు రావటం లేదంటున్నారు. పెద్ద ఎత్తున కేసులు బయటపడటం ఒక రకంగా చూస్తే మంచిదని.. కట్టడిని పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉందంటున్నారు. అయితే.. వాదనలో పస లేదని.. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయటంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందంటున్నారు. పరస్పర విరుద్ధ వాదనల్లో ఏది నిజమన్నది రానున్న రోజుల్లో తేలుతుందని చెప్పాలి.