Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ : వైసీపీ ఎమ్మెల్యేలు హైకోర్టు మెట్లెక్కేలా చేస్తోందిగా !

By:  Tupaki Desk   |   1 May 2020 6:30 AM GMT
లాక్ డౌన్ : వైసీపీ ఎమ్మెల్యేలు హైకోర్టు మెట్లెక్కేలా చేస్తోందిగా !
X
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో కరోనా కట్టడి కోసం కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి లాక్ డౌన్ ను అమలులోకి తీసుకువచ్చాయి. ఈ లాక్ డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప, ఎవరు ఇంట్లో నుండి బయటకి రాకూడదు. కానీ, కొంతమంది మాత్రం లాక్ డౌన్ నియమాలని యథేచ్ఛగా అతిక్రమిస్తున్నారు. వారిలో ప్రజాప్రతినిధులు కూడా ఉండటం గమనార్హం.

లాక్ ‌డౌన్ సమయంలో కొందరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు హల్‌చల్ చేస్తున్నారని, వారిని అడ్డుకోవాలని కోరుతూ కిషోర్ అనే ఓ అడ్వొకేట్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కొన్ని ఫొటోలను ఆయన తన పిటీషన్‌ కు జత చేశారు. వారంతా లాక్ ‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.

ఆరు మంది వైసీపీ ఎమ్మెల్యే పేర్లను ఈ పిటీషన్‌ లో పొందుపరిచారు. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూధన్ రెడ్డి (శ్రీకాళహస్తి-చిత్తూరు జిల్లా), ఆర్ కే రోజా (నగరి-చిత్తూరు జిల్లా), కిలివేటి సంజీవయ్య (సూళ్లూరుపేట-నెల్లూరు జిల్లా), వెంకట గౌడ (పలమనేరు-చిత్తూరు జిల్లా) విడదల రజినీ (చిలకలూరి పేట-గుంటూరు జిల్లా)లను ఈ కేసులో ప్రతివాదులుగా చేర్చారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సహా కొన్ని చట్టాలను ఆయా ఎమ్మెల్యేలంతా ఉల్లంఘించారని, చట్టపరమైన చర్యలను తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ను అమలు చేస్తోందని న్యాయవాది కిషోర్ తన పిల్‌ లో గుర్తు చేశారు. అయినప్పటికీ..తాము ప్రజా ప్రతినిధులమనే కారణంతో ఆ ఎమ్మెల్యేలందరూ బాహ్య ప్రపంచంలోకి తిరుగుతున్నారని, బహిరంగ సమావేశాలను నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే వారు సోషల్ డిస్టెన్సింగ్‌ ను కూడా పాటించలేదు అని అయన తన ఫీల్ లో పొందుపరిచారు. ఎమ్మెల్యేలందరికీ కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించేలా రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేయాలని విజ్ఙప్తి చేశారు. ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతున్నారని, పోలీసులు కూడా వారికి అడ్దు చెప్పట్లేదని ఆరోపించారు. దీనిపై హైకోర్టు తక్షణమే స్పందించాలని అయన కోరారు.

అయితే, న్యాయవాది తన పిల్‌ లో పొందుపరిచిన ఆ ఆరుమంది ఎమ్మెల్యేలు కూడా లాక్ ‌డౌన్ సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరుగాడుతున్న వారే. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, నిత్యావసర సరుకుల పంపిణీ, కోడిగుడ్లు, కూరగాయలు, శానిటైజర్లను ప్రజలకు అందజేశారు. తమ నియోజకవర్గాల పరిధిలో పోలీసులు, మున్సిపల్ అధికారులతో లాక్‌డౌన్ పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మొత్తంగా లాక్ డౌన్ ..అధికార పార్టీ కొందరు ఎమ్మెల్యేలను కోర్టు మెట్లెక్కేలా చేస్తోంది.