Begin typing your search above and press return to search.

క‌రోనాతో ప్ర‌కాశం గ‌ట్టెక్కినట్టే.. కుదుట‌ప‌డ‌ని క‌ర్నూలు

By:  Tupaki Desk   |   8 May 2020 10:17 AM GMT
క‌రోనాతో ప్ర‌కాశం గ‌ట్టెక్కినట్టే.. కుదుట‌ప‌డ‌ని క‌ర్నూలు
X
క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. భారీగా ప‌రీక్ష‌లు చేస్తుండ‌డంతో పెద్ద సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు వ‌స్తున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. దీంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లాలో అత్య‌ధికంగా కేసులు ఉన్నాయి. ఈ జిల్లాలో ఏకంగా 540 కేసులు నమోద‌వ‌డంతో అధికార యంత్రాంగంతో పాటు ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు. అయితే ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చింద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తోంది. కానీ వాస్త‌వంగా చూస్తే ఆ విధంగా లేదు. ఇక ప్ర‌కాశం జిల్లా కూడా క‌రోనా నుంచి గ‌ట్టెక్కింద‌ని ప్ర‌క‌టిస్తున్నారు. ఎందుకంటే కొన్ని రోజులుగా ఆ జిల్లాలో ఒక్క కేసు కూడా న‌మోదు కావ‌డం లేదు. దీంతో క‌రోనాను త‌రిమికొట్టామ‌ని అక్క‌డి అధికారులు, ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ రెండు జిల్లాలో ప‌రిస్థితి ఎలా ఉందో చూద్దాం.

క‌ర్నూలు జిల్లాలో 45 రోజుల్లో సుమారు 15 వేల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. కానీ వాటి వివరాలను బహిర్గతం చేయడం లేదు. ఇక రోజు వారీగా విడుద‌ల చేస్తున్న క‌రోనా కేసుల వివ‌రాల్లో క‌ర్నూలు జిల్లా పేరు త‌ప్ప‌నిస‌రిగా ఉంటోంది. ఇంకా 400 ప‌రీక్ష‌ల ఫ‌లితాలు రావాల్సి ఉంది. నమూనాలు సేక‌రించి ల్యాబ్‌కు పంపుతున్నారు.. కానీ ఎప్పుడు ఫలితాలు వ‌స్తాయ‌నేది తెలియ‌డం లేదు. ఫలితాలు వచ్చే వరకు అనుమానితుల కుటుంబ సభ్యులకు, కాంటాక్ట్‌ కేసులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం లేదు. ఈ కారణంగానే జిల్లాలో పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయ‌ని ప‌లువురు చెబుతున్నారు. తాజాగా శుక్ర‌వారం తాజాగా ఇద్ద‌రు క‌రోనాతో మృతిచెంద‌గా 7 కేసులు న‌మోదై మొత్తం కేసులు 547కు చేరుకున్నాయి.

ఇక ప్ర‌కాశం జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం లేదు. మే 2వ తేదీన ఒకే ఒక్క పాజిటివ్‌ కేసు నమోదు కాగా అప్ప‌టి ఉంచి ఇప్పటివ‌ర‌కు ఒక్క కేసు కూడా రాలేదు. ఈ జిల్లాలో మొత్తం కేసులు 61 ఉన్నాయి. వీఆర్‌డీఎల్, ట్రూనాట్ ప‌రీక్ష‌ల్లో కూడా ఒక్క కేసు వెలుగులోకి రావ‌డం లేదు. దీంతో క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ప్ర‌జ‌ల‌తో పాటు ప్ర‌భుత్వ యంత్రాంగం కూడా భావిస్తోంది. రోజూ వందల సంఖ్యలో న‌మూనాలు సేక‌రించి ల్యాబ్‌ల‌కు పంపినా అంద‌రికీ నెగ‌టివ్ వ‌స్తుం‌డ‌డం కొంత ఆనందించే విష‌యం. పైగా ఈ జిల్లాలో 61మందిలో 60మంది వైద్యం పొంది ఇళ్ల‌కు డిశ్చార్జ‌వ‌డం కూడా ఊర‌ట క‌లిగించే విష‌యం. ఈ జిల్లాలో ఒక్క‌రే ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో జిల్లాల్లో కంటైన్‌మెంట్ జోన్లు ఎత్తి వేస్తున్నారు. త్వ‌ర‌లోనే గ్రీన్ జోన్‌ గా ప్ర‌కాశం జిల్లా నిలిచే అవ‌కాశం ఉంది.

క‌రోనా కేసుల్లో అత్య‌ధికంగా క‌ర్నూలు ఉండ‌గా ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా గ్రీన్ జోన్ మారేందుకు సిద్ధంగా ఉంది. క‌రోనా క‌ట్ట‌డి చ‌ర్య‌లు ప‌టిష్టంగా అమ‌లు చేయ‌డంతో ప్ర‌కాశంలో స‌త్ఫ‌లితాలు ఇవ్వ‌గా, అధికార యంత్రాంగం వైఫ‌ల్యంతో ప్ర‌స్తుతం క‌ర్నూలులో క‌రోనా కోరలు చాస్తున్న విష‌యం తెలిసిందే.