Begin typing your search above and press return to search.

లాక్‌డౌన్‌ ఎత్తివేతకు సిద్దమవుతున్న జగన్ సర్కార్?

By:  Tupaki Desk   |   15 May 2020 9:10 AM GMT
లాక్‌డౌన్‌ ఎత్తివేతకు సిద్దమవుతున్న జగన్ సర్కార్?
X
లాక్ డౌన్ ..దేశంలో మహమ్మారి కట్టడి కోసం విధించి 50 రోజులు దాటిపోయింది. ఈ లాక్ డౌన్ వల్ల ప్రజలు, ప్రైవేట్ రంగాలతో పాటుగా ..ప్రభుత్వాలు కూడా భారీగా నష్టపోయాయి. దీనితో ఒకవైపు వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే ఆలోచనలో పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా పూర్తిగా స్తంభించిపోయిన అన్నింటిని పక్కా ప్రణాళికలతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలు పెడుతున్నాయి. అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా విద్యాసంస్థలు, ప్రజా రవాణా, సినిమా హాళ్లు, రెస్టారెంట్ ‌ల కార్యకలాపాల్ని అన్ని జాగ్రత్తలతో ప్రారంభించేందుకు సిద్ధం అయింది. దీనికి సంబంధించిన ప్రామాణిక నిర్వహణ విధానం సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు అని సమాచారం.

ఆ విధానం పై తగిన ప్రణాళికలు రూపొందించి తనకు అందజేయాలని సీఎం జగన్ అధికారులకి సూచించారు. ఇక లాక్ డౌన్ వలన ప్రజా రవాణా పూర్తిగా స్తంభించిపోవడంతో వలస కార్మికులు కాలి నడకను ఆధారం చేసుకున్నారు. అయితే వారి దుస్థితిపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వారిని స్వస్థలాలకు పంపేందుకు అవసరమైన ఆలోచన చేయాలని, వారికి దారి మధ్యలో భోజనం, తాగునీరు అందేలా చూడాలని ఆదేశించారు. కరోనా వైరస్ పై తీసుకోవల్సిన పలు జాగ్రత్తల గురించి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

ఏపీలో ఈ వైరస్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో జరిగిన వైరస్ నిర్దారణ పరీక్షల్లో 57 కేసులు పాజిటివ్ గా నమోదయ్యాయి. దీనితో తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 2157 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కరోనా తో పోరాడి 1252 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 857గా ఉంది. అయితే ఇందులో అత్యధికంగా కర్నూల్, గుంటూరు , కృష్ణా జిల్లాల్లోనే నమోదు అయ్యాయి.