Begin typing your search above and press return to search.

చైనాలో కొత్త ఆంక్షలు.. మూడు రోజులకు ఒకసారే బయటకు రావాలి

By:  Tupaki Desk   |   17 Feb 2020 6:30 AM GMT
చైనాలో కొత్త ఆంక్షలు.. మూడు రోజులకు ఒకసారే బయటకు రావాలి
X
ఎంత ప్రయత్నించినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతకూ కంట్రోల్ కాని కొవిడ్ 19 వైరస్ సంగతి చూసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ.. ఈ వైరస్ విస్తరించటాన్ని మాత్రం ఆపలేక పోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మరణాలు.. వేలాది మందికి ఈ మాయదారి వైరస్ సోకుతుండటంతో ఆ దేశం తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతోంది. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే ఈ వైరస్ తో డ్రాగన్ దేశం ఆగమాగమవుతోంది.

కొవిడ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సులో ఇప్పటికే పలు నిషేధాలు విధించారు. ప్రజా రవాణాను నిలిపివేయటం.. రైళ్లు.. విమాన సర్వీసుల్ని ఆపేశారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలోని ప్రజలు బయటకు రావొద్దని చెబుతున్నారు. అయినప్పటికీ.. వైరస్ వ్యాపించటం ఆగని నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త ఆంక్షల్ని అక్కడి ప్రజలకు విధించారు.

ఎంతో అవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రావొద్దని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు వాహనా వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. ఎంతో అవసరమైతే తప్పించి బయటకు రాకూడదని.. అది కూడా మూడు రోజులకు ఒకసారి ప్రతి ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని పేర్కొంది.

అలా బయటకు వచ్చిన వారు ఆహారం.. ఇతర నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసుకు వెళ్లాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. హుబే ప్రావిన్సులోని పది నగరాల్లో జలుబు.. జ్వరం మందుల అమ్మకాల్ని నిలిపివేశారు. అలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నా.. వారంతా ఆసుపత్రుల్లో చేరాలని చెబుతున్నారు. ఈ రోజు (సోమవారం) నుంచి అత్యవసరం కాని వాహనాలపై బ్యాన్ విధించారు. అవసరం లేని బహిరంగ ప్రదేశాల్ని మూసివేస్తున్నారు.

ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం కొవిడ్ 19 వైరస్ కారణంగా ఇప్పటి వరకు 1770 మంది మరణించినట్లు చెబుతున్నారు. ఒక్క ఆదివారమే వంద మంది వరకు మరణించారని చెబుతున్నారు. ఈ వైరస్ బారిన పడిన వారు 70,500కు చేరుకోగా.. ఒక్క రోజులోనే కొత్త కేసులు 1933 వెలుగు చూశాయి.

వైరస్ బారిన పడిన రోగులు క్రమంగా కోలుకుంటున్నారని.. పరిస్థితి విషమంగా ఉన్న వారి శాతం కాస్త తగ్గుముఖం పట్టినట్లుగా చెబుతున్నారు. హుబే ప్రావిన్సులో 58,182 మందికి కొవిడ్ వైరస్ సోకగా.. వారిలో 6639 మంది కోలుకున్నట్లుగా తేల్చారు. 1696 మంది మరణించారు. గడిచిన నాలుగు రోజులుగా కొవిడ్ వైరస్ బారిన పడే వారి సంఖ్య తగ్గినట్లు గా చెబుతున్నారు. అయినప్పటికీ ప్రమాదం పొంచి ఉందనే చెబుతున్నారు. ఈ అప్రమత్తతే చైనాను కొవిడ్ నుంచి దూరం చేయగలదని చెప్పకతప్పదు.