Begin typing your search above and press return to search.

చైనాలో మ‌రోసారి క‌రోనా పంజా..ముందే మేల్కొన్న హార్బిన్ సిటీ

By:  Tupaki Desk   |   24 April 2020 7:10 AM GMT
చైనాలో మ‌రోసారి క‌రోనా పంజా..ముందే మేల్కొన్న హార్బిన్ సిటీ
X
క‌రోనా క‌ట్ట‌డి చేసి కేసులు న‌మోదు కాని ప‌రిస్థితులు చైనాలో కొన్ని రోజుల కింద‌ట ఏర్ప‌డింది. దీంతో ఆ దేశ ప్ర‌జ‌లు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో దేశంలో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలోనే మ‌రోసారి క‌రోనా వైర‌స్ విశ్వ‌రూపం చూపిస్తోంది. ఇన్నాళ్లు క‌ట్ట‌డికి వ‌చ్చిన క‌రోనా మ‌రోసారి త‌న పంజా విసురుతోంది. గ‌తంలో వ్యూహ‌న్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్ తీవ్రంగా వ్యాప్తి చెంద‌గా ఇప్పుడు మ‌రో న‌గ‌రంపై ఆ వైర‌స్ దాడి చేసింది. హార్బిన్ (harbin) న‌గ‌రంపై క‌రోనా వైర‌స్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ సంద‌ర్భంగా ఆ న‌గ‌రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధించారు.

చైనాలోని అతి పెద్ద సిటీల్లో హార్బిన్ ఒకటి. ఆ న‌గ‌రంలో కోటి మందికి జనాభా ఉంటుంది. ఆ న‌గ‌రంలో ఓ విద్యార్థినికి క‌రోనా సోక‌గా ఆమె ద్వారా మ‌రో 70 మందికి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో ఆ న‌గ‌రం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. ఇటీవల‌ న్యూయార్క్ నుంచి ఓ విద్యార్థిని (22) చైనాకు తిరిగి రాగా ఆమెకు క‌రోనా సోకింది. ఆమె కారణంగా 70మందికి కరోనా సోకడంతో అక్క‌డి ప్ర‌భుత్వ యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంది. దీంతో వెంటనే హార్బిన్ సిటీని పూర్తిగా లాక్‌డౌన్ చేశారు. వ్యూహ‌న్ నేర్పిన పాఠంతో ముందే అధికారులు స్పందించారు. వాస్త‌వంగా న్యూయార్క్ నుంచి ఆ అమ్మాయిని 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచిన స‌మ‌యంలో నెగెటివ్ వచ్చింది. దీంతో ఆమెను క్వారంటైన్ నుంచి ఇంటికి పంపించి వేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల‌కు ఆమె కరోనా వైరస్ బయటపడింది.

క్వారంటైన్ నుంచి వెళ్లాక ఆ విద్యార్థిని తన కుటుంబ‌స‌భ్యులు, మిత్రుల‌తో క‌లిసి చిన్న‌పాటి విందు ఏర్పాటుచేసింది. ఆ కార్య‌క్ర‌మంలో అంద‌రూ ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయితో పాటు ఆ వేడుక కు హాజరైన వారిలో కొంద‌రికి కరోనా వైర‌స్ సోకింది. వారి ద్వారా మ‌రికొంత‌మంది ఆ వైర‌స్‌ బారిన పడ్డారు. దీంతో మొత్తం 70మంది కరోనా వైర‌స్ సోకింది. ఈ ఘ‌ట‌న‌ తో అప్ర‌మ‌త్త‌మైన అక్క‌డి అధికార యంత్రాంగం హార్బిన్ సిటీని పూర్తి లాక్‌డౌన్ చేశారు.

ఈ సంద‌ర్భంగా హార్బిన్‌ లో లాక్‌ డౌన్‌ ను క‌ఠినంగా అమ‌లుచేస్తున్నారు. అన్ని కమ్యూనిటీలు - గ్రామాల ఎంట్రన్స్‌ లో గార్డులను నియ‌మించారు. రాక‌పోక‌ల‌ను పూర్తిగా నిషేధించారు. సామూహిక కార్య‌క్ర‌మాలు - విందులు - వినోదాలు - అంతిమ సంస్కారాలు - వేడుకలపై నిషేధం విధించారు. దీంతో మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఎవరైనా లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసినా, ఇటీవల బయటి దేశాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్‌ లో లేకపోతే వారి స‌మాచారం తెలిపితే రూ.32 వేలు న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టిస్తామ‌ని అధికారులు ప్రకటించారు. మ‌రో వ్యూహ‌న్‌ లా కాకుండా ముందే అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మై ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.