Begin typing your search above and press return to search.

భారత్‌ లో రెండు కరోనా కేసులు - జైపూర్‌ లో ఇటాలియన్‌ కు వైరస్

By:  Tupaki Desk   |   3 March 2020 5:15 PM GMT
భారత్‌ లో రెండు కరోనా కేసులు - జైపూర్‌ లో ఇటాలియన్‌ కు వైరస్
X
భారత్‌ లో మరో కరోనా వైరస్ కేసు నమోదయింది. రాజస్థాన్‌ లోని జైపూర్‌ కు వచ్చిన ఓ ఇటాలియన్ వ్యక్తికి కరోనా ఉన్నట్లు తేలింది. సోమవారం ఢిల్లీ - హైదరాబాద్ నగరాల్లో ఒక్కో వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లుగా తేలగా - ఇప్పుడు ఇది మూడోది. సదరు ఇటాలియన్ శాంపిల్స్ పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించగా పాజిటివ్ తేలింది. అతను ఢిల్లీలోని మరో ఆరుగురిని కూడా సంప్రదించినట్లుగా గుర్తించారు. వీరి శాంపిల్స్ కూడా పుణేకు పంపించారు.

వీరి ఆరుగురిని ఢిల్లీలోని ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. సోమవారం ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్లుగా తేలింది. అందులో ఒకరు ఢిల్లీకి చెందిన వారు కాగా, మరొకరు బెంగళూరులో టెక్కీగా పని చేసే హైదరాబాద్‍‌ వాసి. దీంతో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులకు కరోనా ఉన్నట్లుగా తేలింది. వీరిని కలిసిన వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇటలీ నుండి జైపూర్‌ కు వచ్చిన సదరు వ్యక్తితో పాటు ఆయన భార్యలో కూడా కరోనా లక్షణాలను గుర్తించారు. ఇది నాలుగో కేసు. వారిని జైపూర్‌ లోని ఎస్ ఎంఎస్ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డుకు తరలించారు. భార్యాభర్తలకు కరోనా ఆందోళన కలిగిస్తోంది. వారితో పాటు వచ్చిన మరో 21 మంది పర్యాటకులు సహా 3 భారతీయులను ఆరోగ్య శాఖ అధికారులు పరీక్ష కేంద్రానికి తరలించారు.

చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇతర దేశాలకు పాకుతోంది. ఇప్పుడు భారత్‌ కు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 25వ తేదీన వియన్నా నుంచి భారత్‌ కు వచ్చిన వారిలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలినట్లుగా వెల్లడించింది. ఫిబ్రవరి 25న విమానంలో ప్రయాణించిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది.