Begin typing your search above and press return to search.

దేశంలో కరోనాపై షాకింగ్ నిజాల్ని బయట పెట్టారు

By:  Tupaki Desk   |   23 April 2020 5:30 AM GMT
దేశంలో కరోనాపై షాకింగ్ నిజాల్ని బయట పెట్టారు
X
కరోనాకు సంబంధించినంత వరకూ ప్రాశ్చాత్య దేశాలతో పోలిస్తే.. భారత్ లాంటి దేశంలో దాని తీవ్రత తక్కువనే చెప్పాలి. ముప్పును ముందుస్తుగా గుర్తించి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించటం ఒక ఎత్తు అయితే.. దేశంలోని నగర ప్రజలతో పోలిస్తే.. గ్రామీణ భారతావని అత్యంత క్రమశిక్షణతో వ్యవహరించటం కూడా కరోనా తక్కువ కేసులు నమోదు కావటానికి కారణంగా చెప్పాలి. దేశ జనాభా.. మౌలికసదుపాయాలు తక్కువే అయినా.. కరోనా విషయంలో దేశ ప్రజల్లో నెలకొన్న అవగాహనతోనే.. ఈ వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. దగ్గర దగ్గర 20వేల కేసులకు వచ్చేసినప్పటికి.. విదేశాలతో పోలిస్తే.. మరణాల సంఖ్య తక్కువ కావటం ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది.

కరోనా బారిన పడిన వారికి సాధారణ వైద్యం తోనే 90 శాతం మంది కోలుకోవటం శుభసూచకంగా చెప్పాలి. అదే సమయంలో కేవలం ఒక్క శాతం రోగులు మాత్రమే వెంటిలేటర్ల ద్వారా చికిత్స పొందుతున్న ఆసక్తికర అంశాన్ని చెప్పుకొచ్చారు భారత వైద్య పరిశోధన సంస్థ డిప్యూటీ డైరెక్టర్ గంగా కేడ్కర్ వెల్లడించారు. బుధవారం వరకూ నమోదైన 19,484 కేసుల్లో ఇప్పటి వరకూ 3,870 మంది కోలుకోగా.. 640 మంది మరణించారు. మరణించిన వారిలో అత్యధికులు పెద్ద వయస్కుల వారే. మరణాలు చోటు చేసుకున్న వారిలో దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వారు.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు మాత్రమే మరణిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కరోనా బారిన పడి కూడా 69 శాతం మందిలో వైరస్ లక్షణాలు కనిపించక పోవటానికి కారణం వారిలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండటంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ బారిన పడిన వారు 14 రోజుల్లోపు బయటపడుతుండగా.. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో నాలుగు రోజుల్లోనే బయటపడుతున్న విషయాన్ని గుర్తించారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న వారిలో పద్నాలుగు రోజలు తర్వాత కూడా లక్షణాలు బయట పడటం లేదని తెలుస్తోంది.

మరో షాకింగ్ అంశం ఏమంటే.. దేశంలో కరోనా వ్యాప్తి వ్యాధి లక్షణాలు కనిపించని వారి నుంచి కూడా ఎక్కువగా ఉందన్న విషయాన్ని చెబుతున్నారు. అయితే.. మొత్తం పాజిటివ్ కేసుల్లో ఇదెంత శాతమన్న విషయాన్ని మాత్రం తేల్చాల్సి ఉంది. ఇప్పటివరకూ కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి.. ట్రావెల్ హిస్టరీ ఉన్న వారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. ర్యాండమ్ టెస్టు కానీ.. ఫూల్ టెస్టు కానీ చేస్తే తప్పించి.. దేశంలో కరోనా తీవ్రత ఎంతన్న విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పక తప్పదు. ఏమైనా.. కరోనా పాజిటివ్ విషయంలో మిగిలిన దేశాల కంటే భారత్ మిన్నగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.