Begin typing your search above and press return to search.

ఏపీలో తాజాగా 60 కేసులు..భారత్@35 వేలు

By:  Tupaki Desk   |   1 May 2020 7:30 AM GMT
ఏపీలో తాజాగా 60 కేసులు..భారత్@35 వేలు
X
ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. గడచిన 24 గంటల్లో ఏపీలో తాజాగా 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 7,902 శాంపిళ్లకు గానూ 60 మాత్రమే పాజిటివ్ రావడం ఊరట కలిగించే అంశం. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,463కు చేరుకుంది. ఏపీ సర్కార్ ను కలవరపెడుతున్న కర్నూలులో 25 కేసులు నమోదు కాగా...గుంటూరులో 19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని 403 మంది డిశ్చార్జ్ కాగా - 33 మంది మరణించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,027గా ఉంది. గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 6 - గుంటూరులో 19 - కడపలో 6 - కర్నూలులో 25 - విశాఖపట్నంలో 2 - పశ్చిమ గోదావరిలో 2 కేసులు నమోదయ్యాయి.కరోనా ఫ్రీ జిల్లాగా విజయనగరం తన రికార్డును కొనసాగిస్తోంది. దేశంలో అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ తన రికార్డును కొనసాగిస్తోంది.

మరోవైపు, తెలంగాణలో గురువారం నాడు 22 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజులుగా తగ్గుతున్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం కలవరపెడుతోంది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,038కు చేరుకుంది. హైదరాబాద్‌ లోని మలక్‌ పేట్‌ గంజ్‌ లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్ - జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్‌ లో ముగ్గురు షాపుల యజమానులకు - వారి ద్వారా ఆయా కుటుంబసభ్యులకు కరోనా సోకింది. వీరి కుటుంబాలన్నిటినీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ లో ఉంచారు. రెండు కుటుంబాల్లోని 12 మందికి కరోనా సోకడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. కంటైన్ మెంట్ జోన్లలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ఇక, భారత్‌ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య - మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశంలో 1,993 మందికి కొత్తగా కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 35,043కు చేరింది. గత 24 గంటల్లో భారత్‌ లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,147కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 8,888 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 25,007 మంది చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 10,498కి చేరింది.