Begin typing your search above and press return to search.

ఇటలీ లో కరోనా మరణ మృందంగం: 53వేల కేసులు.. 4825 మరణాలు

By:  Tupaki Desk   |   22 March 2020 11:30 AM GMT
ఇటలీ లో కరోనా మరణ మృందంగం: 53వేల కేసులు.. 4825 మరణాలు
X
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఈ మహమ్మారి 188 దేశాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ కరోనాకు మందు, వ్యాక్సిన్ లేకపోవడంతో అడ్డుకట్ట పడడం లేదు. దీంతో ప్రపంచమంతా ఆందోళనగా ఉంది. మరణాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. బాధితుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది.

ఇప్పటివరకు కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 13వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. బాధితుల సంఖ్య 3 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా 1600మంది మరణించారు.

ఇటలీ దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తూ కబళిస్తోంది. కరోనా దెబ్బకు ఇటలీలో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. వారికి వైద్య సేవలు కూడా అందించడం లేదు. వేలమందికి వైరస్ సోకడంతో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు చికిత్స చేయడం లేదు.దీంతో ఒక తరం మొత్తం ఇటలీలో చనిపోతున్నారు.

శనివారం ఒక్కరోజే ఇటలీ లో దాదాపు 800మంది మృతి చెందారు. దీంతో ఇటలీలో మొత్తం మరణాల సంఖ్య 4825 దాటింది. ఇక కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏకంగా శనివారం 6557 మందికి కరోనా వైరస్ నిర్ధారణ కావడం ఇటలీలో డేంజర్ బెల్ మోగిస్తోంది. ఉత్తర ఇటలీలోని లొంబార్డే లో అత్యధిక కరోనా వైరస్ మరణాలు చోటుచేసుకున్నాయి.

దీంతో ఇటలీలో ఆంక్షలు పెట్టారు. ప్రజలు బయట అడుగుపెట్టవద్దని ప్రభుత్వం సూచించింది. అడుగు పెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. మరణాల్లో చైనాను ఇటలీ దేశం దాటేయడం ఆందోళన కలిగిస్తోంది.