Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ వేళ పెళ్లైన కొత్త జంట బయటకు వెళ్లిందని రానివ్వని ఇంటి ఓనర్

By:  Tupaki Desk   |   30 April 2020 4:15 AM GMT
లాక్ డౌన్ వేళ పెళ్లైన కొత్త జంట బయటకు వెళ్లిందని రానివ్వని ఇంటి ఓనర్
X
కరోనా వేళ చోటు చేసుకుంటున్న సిత్రాలు అన్ని ఇన్ని కావు. తాజా ఉదంతం ఆ కోవలోకే వస్తుంది. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు మహానగరంలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ వేళ.. ఎవరింట్లో వారు ఉండాలని.. అనవసరంగా బయటకు వెళ్లకూడదన్న విషయం తెలిసిందే. అయితే.. దీన్ని పట్టించుకోకుండా తమకు తోచినట్లుగా తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదే తీరులో వ్యవహరించిన ఒక జంటకు బెంగళూరుకు చెందిన ఇంటి ఓనర్ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.

రాష్ట్రంలోని తమకూరు జిల్లాకు చెందిన ఒక జంట (రంగా.. పవిత్ర) కు ఇటీవల పెళ్లైంది. అబ్బాయి కారు డ్రైవర్ గా పని చేస్తుంటాడు. బెంగళూరులోని బృందావన్‌ లేఔట్ లో వారు అద్దెకు ఉంటున్నారు. కొత్తగా పెళ్లి కావటంతో బంధువులు పలువురు తమ ఇళ్లకు రావాలని వారిపై ఒత్తిడి తెచ్చేవారు. లాక్ డౌన్ వేళ ఇంట్లో ఖాళీగా ఉన్న నేపథ్యంలో.. ఆ జంట వీలున్నప్పుడల్లా వారి బంధువుల ఇళ్లకు వెళ్లి.. అక్కడ ఒకట్రెండు రోజలు ఉండి వచ్చేశారు. ఇదే తరహాలో ఇప్పటికి మూడు నాలుగుసార్లు బంధువుల ఇళ్లకు వెళ్లి వచ్చారు.

తాజాగా అదే తరహాలో బంధువుల ఇంటికి వెళ్లి మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. ఈసారి వారింటి యజమాని వారిని లోపలకు అనుమతించలేదు. బయటకు వెళ్లి ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు.. మీకు కరోనా అంటి ఉంటే పరిస్థితి ఏమిటి? మీ కారణంగా మేమంతా ఇబ్బందుల్లో పడతాం. కరోనా లేదన్న రిపోర్టు తీసుకొచ్చి చూపిస్తే తప్పించి ఇంట్లోకి అనుమతించే ప్రసక్తే లేదని తేల్చేశాడు.

దీంతో.. షాక్ తిన్న వారు యజమానితో విభేదించారు. అయినా ససేమిరా అన్నారు. దీంతో.. ఆ రాత్రంతా వారు కారులోనే గడపాల్సి వచ్చింది. తర్వాత పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. అక్కడ కూడా యజమాని ఇంట్లోకి అనుమతించే విషయంలో ససేమిరా అనటమే కాదు.. అవసరమైతే అడ్వాన్సుగా ఇచ్చిన డబ్బులు అప్పటికప్పుడు తిరిగి ఇచ్చేస్తానే కానీ.. ఇంట్లోకి మాత్రం అడుగు పెట్టనిచ్చేది లేదన్నారు. దీంతో.. వారు చేసేదేమీ లేక.. మరో ఇంట్లోకి మారారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.