Begin typing your search above and press return to search.

కర్నూలు ‘వూహాన్’ని తలపిస్తోందా?

By:  Tupaki Desk   |   20 April 2020 5:30 AM GMT
కర్నూలు ‘వూహాన్’ని తలపిస్తోందా?
X
చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ పుట్టింది. ప్రపంచానికి పాకి మరణమృదంగం వినిపిస్తోంది. కరోనా కారణంగా వూహాన్ లో వేలమంది చనిపోయారు. అధికారికంగా తక్కువ చూపించినా వైరస్ వ్యాప్తి అక్కడ విపరీతంగా ఉంది. అందుకే లాక్ డౌన్ ను అత్యధికంగా వూహాన్ లోనే విధించింది చైనా సర్కారు. సిటీని మొత్తం లాక్ చేసి ఎవరిని బయటకు రాకుండా ఆస్పత్రులు కట్టి నివారణ చర్యలు చేపట్టి మొత్తానికి కంట్రోల్ చేసింది. ఇప్పుడు లాక్డౌన్ వూహాన్ లో ఎత్తివేయడంతో సాధారణ జీవనం అక్కడ సాగుతోంది.

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మరో ‘వూహాన్’గా కర్నూలు నగరం మారిపోతుందా అన్న భయం అక్కడి జనాలను వెంటాడుతోంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఆదివారం కర్నూలులోని మేదరి వీధికి చెందిన వ్యక్తి కరోనాతో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో కర్నూలులో మృతుల సంఖ్య 5కు చేరింది. ఆదివారం ఏకంగా జిల్లాలో మరో 26మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 156కు చేరింది. ఇందులో ఒక్క కర్నూలు నగరంలోనే 80మంది కరోనా పాజిటివ్ కేసులు ఉండడం గమనార్హం. దీంతో అధికారులు 27మండలాలు, 10 మున్సిపాలిటీలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. రాకపోకలు నిలిపివేసి నిత్యావసరాలను డోర్ డెలివరీ చేస్తున్నారు. బయటకొస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే విశాఖలో కూడా ఇలానే కరోనా కేసులు ప్రబలాయి. అక్కడ నాలుగు బృందాలు పకడ్బందీగా పనిచేసి కరోనాను వ్యాపించకుండా చేశాయి. అయితే కర్నూలులో అది చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే కర్నూలులో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

కర్నూలులో ఏపీలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ ఇంకా ఎక్కువ కఠిన నిబంధనలు అమలు చేయాలి. లాక్ డౌన్ ను అష్టదిగ్బంధనంలా చేయాలి. ఎక్కడి వారిని అక్కడే ఉంచి నివారణ చర్యలు చేపట్టాలి. చైనాలోని వూహాన్ లో చేసినట్టు చేస్తేనే కర్నూలులో కరోనా కట్టడి అయ్యే అవకాశాలున్నాయి. లేదంటే కరోనాతో కర్నూలు కల్లోలంగా మారడం ఖాయం.

ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు దీని మీద దృష్టి పెట్టి మరింత కఠినంగా కర్నూలులో లాక్ డౌన్ అమలు చేయకపోతే మరో ‘వూహాన్’లో కర్నూలు కావడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.