Begin typing your search above and press return to search.

అక్కడ ఇంట్లో నుండి బయటకి వస్తే మళ్లీ ఇంటికి వెళ్లలేరంట !

By:  Tupaki Desk   |   1 May 2020 10:59 AM GMT
అక్కడ ఇంట్లో నుండి బయటకి వస్తే  మళ్లీ ఇంటికి వెళ్లలేరంట !
X
ఏపీలో కరోనా రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ వరకు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ కుమార్‌ ప్రకటించారు. ఆయన పట్టణంలోని రెడ్ ‌జోన్‌ ప్రాంతాలతో పాటు వరవకట్ట ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు ఎక్కువగా నమోదవ్వటంతో నరసరావుపేట పేరు రాష్ట్రంలో మారు మోగిపోతున్నదన్నారు. పట్టణంలో చివరి పాజిటీవ్‌ కేసు నమోదైన తదుపరి 28 రోజులు లాక్ ‌డౌన్‌ అమల్లో ఉంటుందని తెలిపారు.

ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు రావద్దని, లాక్‌ డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌ డౌన్‌ సందర్భంగా పాల విక్రయాలతో పాటు నిత్యావసరాలు, మందులు ఇళ్లకే సరఫరా చేసే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇక నుంచి పాజిటీవ్‌ వ్యక్తి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లను హోం క్వారంటైన్‌లో ఉంచే వసతి కల్పిస్తున్నామని తెలిపారు. పరీక్షల్లో పాజిటీవ్‌ అని నిర్ధారణ అయితే వారిని కొవిడ్‌ ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా అనారోగ్యం తో ఉంటే రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్ ‌లకు తెలియ జేస్తే వారికి వైద్య సేవలు అందించటం జరుగుతుందన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనా వ్యాప్తి నివారణకు సహకరించాలని సూచించారు .

తాజాగా గత 24 గంటల్లో కొత్తగా మరో 60 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శుక్రవారం బులిటెన్‌లో ఆరోగ్య ఆంధ్ర ప్రకటించింది. కర్నూలు జిల్లాలో 25, గుంటూరు జిల్లాలో 19, అనంతపురం జిల్లాలో 6.. విశాఖ, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండేసి కేసుల చొప్పు నమోదయ్యాయి. తాజా కేసులు కలిపితే మొత్తం కేసుల సంఖ్య 1463 కాగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 1027గా ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 411 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లా 306 కేసులు ఉన్నాయి