Begin typing your search above and press return to search.

కరోనా తాజా ప్రేయసి రష్యా?.. రెండు రోజుల్లో ఎన్ని కేసులో తెలుసా?

By:  Tupaki Desk   |   21 April 2020 5:21 AM GMT
కరోనా తాజా ప్రేయసి రష్యా?.. రెండు రోజుల్లో ఎన్ని కేసులో తెలుసా?
X
సోషల్ మీడియాలో ఇటీవల ఒక పోస్టు తెగ వైరల్ అవుతోంది. కరోనా పిశాచి తాజా లవ్వర్ అమెరికా అయితే.. క్రష్ మాత్రం ఇండియా మీదనే అన్నది ఆ పోస్టు సారాంశం. ఈ పోస్టు మీద పెద్ద ఎత్తున టిక్ టాక్ వీడియోల్ని చేసేస్తున్నారు. అలాంటి ఈ పోస్టును కాస్త మార్చుకోవాల్సిన అవసరం ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ఉన్న దేశాల్లో ఒకటిగా రష్యా నిలిచింది. చైనాతో పెద్ద ఎత్తున సరిహద్దుల్ని పంచుకునే ఆ దేశంలో కరోనా కేసులు పెద్దగా నమోదు కాకపోవటంపైనా ఆసక్తికర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఇదంతా చైనా ప్లానింగేనని విరుచుకుపడే వారు లేకపోలేదు.

తన మిత్రుడ్ని సేవ్ చేసేలా చైనా ప్లాన్ చేసిందన్న మాట వినిపించింది. ఇదిలా ఉంటే.. గడిచిన రెండు రోజుల్లో రష్యాలో పెరిగిపోయిన కరోనా పాజిటివ్ కేసులు ఇప్పుడా దేశాన్ని కొత్త డేంజర్ గా మారాయి. కరోనా తొలి కేసు జనవరి 31న నమోదైనప్పటికీ.. మిగిలిన దేశాలతో పోలిస్తే.. రష్యాలో విస్తరణ చాలా తక్కువగా సాగింది. దీనికి భిన్నంగా గడిచిన రెండు రోజుల్లో దేశ వ్యాప్తంగా 10,328 కేసులు నమోదు కావటం.. అందులోన దేశ రాజధాని మాస్కోలోనే 5,596 కేసులు ఉండటం షాకింగ్ గా మారింది. కరోనా కారణంగా ఇప్పటివరకూ ఆ దేశంలో 405 మంది మరణించారు.

రష్యాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం మాస్కోలోనే కావటంతో .. దాన్ని నియంత్రించే పనిలో పడింది పుతిన్ సర్కార్. రానున్న రోజుల్లో మరింత గడ్డుపరిస్థితిని ఎదుర్కొవాల్సి ఉంటుందని మాస్కో డిప్యూటీ మేయర్ వాపోతున్నారు. రష్యాలో ఇంత భారీగా పాజిటివ్ కేసులు నమోదు కావటానికి కారణం.. ఆ దేశం ప్రదర్శించిన ఓవర్ కాన్పిడెన్స్ గా చెప్పక తప్పదు. మిగిలిన దేశాలకు భిన్నంగా లాక్ డౌన్ ను విధించే విషయంలో రష్యా చాలా ఆలస్యం చేసింది. అందుకు తగ్గ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోంది.

మిగిలిన దేశాలకు భిన్నంగా మార్చి 30 నుంచి రష్యాలో లాక్ డౌన్ షురూ అయ్యింది. అప్పటికే ఇష్టారాజ్యంగా ప్రజలు తిరగటంతో కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రష్యాలోని చైనీయులు పలువురు.. ఆ దేశ సరిహద్దు నుంచి తమ దేశానికి చేరుకునే ప్రయత్నం చేశారు.

రష్యా నుంచి వచ్చే చైనీయుల కారణంగా తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతూ.. వారిని అనుమతించక పోవటంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. సొంత దేశస్తుల్ని దేశంలోకి అనుమతించేందుకు ససేమిరా అనే దేశంగా చైనా మారింది. వారితో అంత ఇబ్బంది అనుకుంటే.. వారిని దేశంలోకి అనుమతించి.. క్వారంటైన్ లోకి పంపేస్తే సరిపోతుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా తమ దేశీయుల ఎంట్రీకి సైతం నో చెప్పేసే దేశంగా చైనాను చెప్పక తప్పదు.