Begin typing your search above and press return to search.

గుండెలు అదిరే వాస్తవాలు.. శ్రీకాళహస్తి లో అలా పాకిపోయిందట

By:  Tupaki Desk   |   25 April 2020 4:15 AM GMT
గుండెలు అదిరే వాస్తవాలు.. శ్రీకాళహస్తి లో అలా పాకిపోయిందట
X
తిప్పి తిప్పి కొడితే లక్ష దాటని జనాభా ఉన్న పట్టణంలో యాభై వరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం ఏమిటి? ఎందుకిలా జరిగింది? దీనికి బాధ్యులు ఎవరు? ఎవరి అలక్ష్యంతో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి వాసుల్నివణికేలా చేస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రముఖ శైవక్షేత్రంగా విరసిల్లే ఈ ఊరు ఇప్పుడు కరోనా భయంతో చిగురుటాకులా వణికిపోతోంది. మరింత దారుణమైన విషయం ఏమంటే.. కరోనా బాధితుల్లో ఏకంగా పదిహేడు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం.

చిత్తూరు జిల్లాలో 73 పాజిటివ్ కేసుల్లో యాభైకు పైనే ఒక్క శ్రీకాళహస్తి పట్టణంలో నమోదు కావటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక్కడి కేసుల్ని అధ్యయనం చేసినప్పుడు గుండెలు అదిరే నిజాలు బయటకు వస్తాయి. స్థానిక అధికారుల నిర్లక్ష్యమే కొంప ముంచిందంటున్నారు. ప్రతి సందర్భంలోనూ చూసిచూడనట్లుగా వ్యవహరించిన తీరే తాజా దుస్థితికి కారణంగా చెప్పక తప్పదు.

మార్చి 12న లండన్.. ఢిల్లీ.. చెన్నై నుంచి పదిహేను మంది రాగా వారిలో నలుగురికి వైరస్ సోకింది. ఆ సందర్భంగా పాజిటివ్ గా తేలిన వారి కాంటాక్టును గుర్తించటం.. వారిని క్వారంటైన్ లో చోటు చేసుకున్న అలక్ష్యానికి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. తాజాగా శ్రీకాళహస్తి పట్టణమంతా రెడ్ జోన్ గా మార్చేసి.. పోలీసుల వాహనాల సైరన్లు.. పోలీసులు హెచ్చరికలు తప్ప మరేమీ వినిపించని పరిస్థితికి పట్టణం వెళ్లిపోయింది.

మార్చి 18న లండన్ నుంచి శ్రీకాళహస్తికి వచ్చాడో యువకుడు. కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లగా.. అతనికి వైరస్ సోకిన వైనాన్ని మార్చి 25న గుర్తించారు. అప్పటికే అతను కుటుంబ సభ్యులు.. బంధువులతో గడిపాడు. ఊరి చివర ఉన్న దాబాలకు వెళ్లాడు. సదరు యువకుడికి పాజిటివ్ అని తేలిన వెంటనే.. అతడి కుటుంబ సభ్యుల్ని మాత్రమే క్వారంటైన్ కు తరలించారు.

అంతే తప్పించి.. అతడు ఎవరెవరిని కలిశాడు? ఎక్కడెక్కడకు వెళ్లాడన్న విషయాన్ని ఆరా తీసి.. వారందరిని క్వారంటైన్ కు తరలించి ఉంటే.. మూలంలోనే ముగిసి పోయేది. కానీ.. అధికారులు ఇక్కడో పెద్ద తప్పు చేశారు. పాజిటివ్ గా తేలిన వ్యక్తి కాంటాక్టు అయిన వారందరిని వదిలేశారు. దీనికి ఫలితంగా అతడు కాంటాక్టు అయిన వారిలో నలుగురికి.. అతని స్నేహితుడికి పాజిటివ్ గా తేలింది. ఈ సందర్భం లో అయినా.. ఈ ఐదు కేసులతో సంబంధం ఉన్న వారిని.. వారు కాంటాక్టు అయిన వారిని గుర్తించి ఉంటే బాగుండేది. కానీ.. ఆ సందర్భంలోనూ అధికారులు స్పందించింది లేదు. ఇది రెండో తప్పు.

ఇలాంటి వేళలోనే మర్కజ్ లింకు ఊరికి వచ్చింది. శ్రీకాళహస్తి నుంచి ఢిల్లీ సమావేశాలకు వెళ్లిన 13 మంది ఊరికి తిరిగి వచ్చారు. కేంద్ర నిఘా విభాగం హెచ్చరించే వరకూ వారిని గుర్తించే విషయంలో అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో వారిని గుర్తించే విషయంలో ఆలస్యం చోటు చేసుకోవటంతో పాటు.. రిజర్వేషన్ లేకుండా వచ్చిన కొందరిని గుర్తించే విషయంలోనూ అధికారులు ఫెయిల్ అయ్యారు.

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించటంతో అతన్ని క్వారంటైన్ కు తరలించారు. అతడితో పాటు అతడి భార్యను కూడా పంపారే కానీ పిల్లల్ని వదిలేశారు. బ్యాడ్ లక్ ఏమంటే.. అధికారులు విస్మరించిన పిల్లల్లో ఒకరికి పాజిటివ్ రావటం.. అతడి కారణంగా పలువురికి పాజిటివ్ గా తేలింది. ప్రైమరీ నుంచి కాంటాక్టులకు అంటుకోవటం.. సెకండరీ కాంటాక్టును గుర్తించే విషయంలో జరిగిన పొరపాట్లు ఈ రోజున శ్రీకాళహస్తి పట్టణం ప్రమాదపు అంచుల వరకూ చేరే పరిస్థితికి కారణమైంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. తప్పులే ప్రజలకు శాపాలు గా మారాయి.