Begin typing your search above and press return to search.

ప్రెస్ మీట్ పెట్టే వేళలోనే కేసులు పెరుగుతాయేంది సారు?

By:  Tupaki Desk   |   1 May 2020 6:15 AM GMT
ప్రెస్ మీట్ పెట్టే వేళలోనే కేసులు పెరుగుతాయేంది సారు?
X
ఓపక్క దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతున్నాయి. మిగిలిన దేశాలతో పోలిస్తే.. భారత్ లో వైరస్ వ్యాప్తికి చెక్ చెప్పేలా లాక్ డౌన్ విధించటం తెలిసిందే. అయినప్పటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక కొలిక్కి రాని పరిస్థితి. దీనికి భిన్నంగా తెలంగాణ లో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్న వైనం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మామూలుగానే మేధావి సీఎం ఇమేజ్ ఉన్న కేసీఆర్.. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే విషయంలో సక్సెస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది.

గడిచిన ఐదారు రోజులుగా తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సింగిల్ డిజిట్ కు తగ్గిపోయిన వైనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాలతో పోలిస్తే.. కరోనా నిర్దారణ పరీక్షలు తక్కువగా చేసే తెలంగాణలో కొత్త కేసులు రాకపోవటం వెనుక అసలు కిటుకు వేరే ఉందన్న విమర్శను తెలంగాణ విపక్ష నేతలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం ఒక్కరోజులోనే 22 కొత్త కేసులు నమోదైనట్లుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు.. ఒకే రోజులో ముగ్గురు మరణించినట్లుగా పేర్కొంది.

వరుస పెట్టి సింగిల్ డిజిట్ కే పరిమితమైన కరోనా పాజిటివ్ సంఖ్య ఒక్కసారిగా ఇంత భారీగా ఎందుకు పెరిగినట్లు? అన్నది ఒక ప్రశ్నగా మారింది. దీనిపై ఆసక్తికర వాదన వినిపిస్తోంది. గతంలోని పరిణామాల్ని చూసినా.. కరోనాపై ప్రెస్ మీట్ పెట్టే సమయానికి తెలంగాణ లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న వాదనను పలువురు వినిపిస్తున్నారు. రానున్న మంగళవారం కరోనాపై కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంలోనే లాక్ డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు.

అదేం సిత్రమో కానీ.. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే సమయానికి పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం.. ఇలాంటివేళ లాక్ డౌన్ ఎత్తేయటం ఏ మాత్రం సబబు కాదన్న వాదనను వినిపిస్తూ లాక్ పొడిగింపు నిర్ణయాన్ని తీసుకుంటారన్న మాట ప్రచారంలో ఉంది. దీనికి తగ్గట్లే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం మరో ఐదు రోజుల్లో ఉందని.. ఈ నేపథ్యంలోనే పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. అయితే.. ఇలాంటి అనుమానాల్లో పస లేదని.. అనుకోకుండానే కొత్త కేసులు తెర మీదకు వచ్చాయని.. వాటిని దాచుకోకుండా వివరాలు వెల్లడిస్తున్నారే తప్పించి అంకెల గారడీ చేయటం లేదంటున్నారు. ఏది ఏమైనా.. సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టే వేళలో పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువగా ఉండటం యాదృశ్చికమే తప్పించి మరేమీ లేదంటున్నారు.